ట్రాఫిక్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయాలి
- ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ ఆకస్మిక తనిఖీ
- రికార్డులు, ఈ ప్రమాదాల రిజిస్టర్ల పరిశీలన
సిద్దిపేట క్రైం, జూన్ 9 : సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను మరింత బలోపేతం చేయాలని ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, పెండింగ్లో ఉన్న వివిధ పనులను సత్వరమే పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.
సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్లో వసతులు, పరిసరాలు, సిబ్బంది హాజరు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఈ-చలాన్, పరిపాలనా రికార్డులను నిశితంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కాపాడుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న వివిధ సాంకేతిక పరికరాల పనితీరును పరిశీలించారు.






