calender_icon.png 17 April, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హోంగార్డు మృతి

08-04-2025 11:11:21 AM

ఇద్దరు కానిస్టేబుల్ లకు తీవ్ర గాయాలు, హోమ్ గార్డ్ మృతి

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8(విజయక్రాంతి): మియాపూర్ లో ఘోర రోడ్డు(Road accident in Miyapur) ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో(Miyapur Metro) పిల్లర్ నంబర్ 600 వద్ద యూటర్న్ చేస్తుండగా అదుపుతప్పి అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్‌ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు.

నో ఎంట్రీ వాహనాలను నియంత్రిస్తున్నారు. అదే సమయంలో కూకట్‌పల్లి భరత్ నగర్‌(Kukatpally Bharat Nagar)లో బియ్యం బస్తాలను అన్‌లోడ్ చేసిన ఓ లారీ.. మియాపూర్ వైపు అతివేగంగా వచ్చి ట్రాఫిక్ బూత్‌ను ఢీకొట్టింది. దీంతో  అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డు సింహాచలం తలకు తీవ్రమైన గాయలు కాగా, రాజవర్ధన్ కుడి చెయ్యి భుజంలో ఫ్రాక్చర్ అయింది. విజేందర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

క్షత గాత్రులను వైద్యం నిమిత్తం మదీనాగూడలోని శ్రీకర ఆసుపత్రికి  తరలించారు. చికిత్స పొందుతూ హోమ్ గార్డ్ సింహాచలం(Traffic Home Guard Simhachalam) మృతి చెందినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. మిగిలిన ఇద్దరూ కానిస్టేబుళ్లను మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి(ఏఐజి) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ సదాశివపేటకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం,అతి  వేగమే కారణమని తెలిపారు. మృతుడు సింహాచలం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అని తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.