calender_icon.png 7 October, 2024 | 4:07 AM

సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

07-10-2024 01:56:34 AM

పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఆధునిక యుగంలో మన సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

రెండు రోజుల దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన పర్యాటక అభివృద్ధి, ప్రమోషన్ వంటి అంశాలపై అక్కడ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని సంఘటితం చేయడంలో బతుకమ్మ వేడుకలు ముఖ్య భూమిక పోషించాయన్నారు. అనంతరం దుబాయ్ పర్యాటక శాఖ అధికారి జాసీం మొహ్మద్ అల్ అవాదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో నివసించే దుబాయిలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కైరో స్ట్రీట్‌లోని ఇత్తెహాద్ స్కూల్ గ్రౌండ్‌లో బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకున్నారు.

అమెరికాకు మంత్రి జూపల్లి

పర్యాటక రంగంలో పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమెరికా వెళ్లారు. వాషింగ్టన్ డీసీలో ఆయన ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం లాస్ ఏంజెల్స్‌కు వెళ్తారు. ఈ నెల 9, 10 తేదీల్లో లాస్‌వేగాస్‌లో పర్యటిస్తారు. అక్కడ ఐమెక్స్ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ నెల 12న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.