11-03-2025 12:28:55 AM
వికారాబాద్, మార్చి 10: సాంప్రదాయ చేతివృత్తుల వారు ఆర్థికంగా మరింత స్థిరపడేందుకు పీఎం విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఛాంబర్ లో విశ్వకర్మ వృత్తులపై ఆధారపడ్డ కుటుంబాలను ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి స్వానిధి పథకం అమలు, పురోగతిపై వివిధ శాఖల అధికారులు, పథకం అమలు కమిటీ సభ్యులతో అదనపు కలెక్టర్ సుధీర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... విశ్వకర్మ వృత్తులపై ఆధారపడ్డ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు తోడ్పాటునందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి తదితర 18 రకాల చేతివృత్తుల వారు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
సి.ఎస్.సి కేంద్రాల ద్వారా విశ్వకర్మ చేతి వృత్తుల వారు దరఖాస్తులు చేసుకునే విధంగా అదేవిధంగా అధికంగా పథకాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. రుణాల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.