calender_icon.png 2 April, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిపురారంలో ట్రాక్టర్ల దొంగల అరెస్ట్

01-04-2025 01:59:46 AM

  1. నలుగురికి రిమాండ్ భారీ 
  2. 3 ట్రాక్టర్లు, 2 ట్రాలీలు, కల్టివేటర్లు స్వాధీనం 
  3. వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ

త్రిపురారం, మార్చి 31  : హాలియా సర్కిల్ పరిధిలో ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ పరికరాలను చోరీ చేసి విక్రయిస్తున్న ముఠాను త్రిపురారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు ట్రాక్టర్లు, రెండు ట్రాలీ, కల్టివేటర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. త్రిపురారం పోలీస్ స్టేషన్లో సోమవారం ఎస్‌ఐ ప్రసాద్తో కలిసి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు విలేకరులకు కేసు పూర్వపరాలు వెల్లడించారు.

త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన వేముల నాగరాజు, అంజనపల్లి పంచాయతీ ఆవాసం పాల్తీతండాకు చెందిన డేగావత్ బాబూనాయక్,  రామారం గ్రామానికి చెందిన ఎరకల శివ, బొర్రాయిపాలేనికి చెందిన గద్దల రాజీవ్ ఆర్థిక ఇబ్బందుతో సతమతమవుతున్నారు.

దీంతో ముఠాగా ఏర్పడి కొంతకాలంగా త్రిపురారం, నిడమనూరు మండలాల పరిధిలో ట్రాక్టర్లను, ట్రాలీలు, వ్యవసాయ పరికరాల చోరీకి  పాల్పడుతున్నారు. రైతులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ నెల 30న మధ్యాహ్నం ఎస్‌ఐ సిబ్బందితో కలిసి అంజనపల్లి శివారులో వాహనాలు తనిఖీలు చేస్తుండగా వేముల నాగరాజు స్వరాజ్ ట్రాక్ట్ప కల్టివెటర్, ఆఫ్ వీల్స్, ట్రాక్టర్ గొర్రు తీసుకెళ్తుండగా ట్రాక్టర్కు ముందు డేగావత్ బాబూనాయక్, వెనక ఎరక శివ, గడ్డల రాజీవ్ బైకులపై అనుసరిస్తుండగా అనుమానం వచ్చి నిలిపి విచారించారు.

వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది. నిందితులు బైక్లపై ఉదయం రెక్కి నిర్వహించి రాత్రి ట్రాక్టర్ ఇంజిన్లు, ట్రాలీలు, వ్యవసాయ పరికరాలు చోరీ చేసే వారు. వీటిని నీలాయిగూడెం శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో ఉంచి ఆంధ్రాకు తీసుకెళ్లి అక్కడి రైతులకు తక్కువ ధరకు విక్రయించే వారని డీఎస్పీ తెలిపారు.

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ ప్రసాద్, కానిస్టేబుళ్లు నవీన్రెడ్డి, శ్రీనివాస్, శ్రీను, రాము, రాంబాబు, మణిరత్నంతోపాటు హోంగార్డులు చాంద్పాషా, నర్సింహను హాలియా సీఐ ధనుంజయగౌడ్, డీఎస్పీ అభినందించారు.