అంబటి సురేంద్రరాజు
In every real man a child is hidden that wants to play
- Nietzsche
Poems are not made out of Ideas. They are made of words.
- Stephane Mallarme
“హృదయపు లోతట్టు విస్మయాల్ని
మెట్టీ మెత్తీ
ఏకాంతాంతాల ఇన్ఫెర్నో వారగా
లోపలికొచ్చేయండి” (‘తుదిరాత్రి దరువు’లో నుంచి)
సిద్ధార్థ కవిత్వం బాగోతులోని రంది. ఈ మాట మనకు కవే స్వయంగా చెబుతాడు. సిద్ధార్థ స్థూలదృష్టికి కవి. కానీ ఆయన కేవలం కవి కాదు. He is more than a poet.
సిద్ధార్థ బహురూపి. అక్షరాలతో వ్యవసాయం చేసేవాడు కాబట్టి అతడు మనకి కవిలాగ గోచరిస్తాడు. బాగోతం ఆడే టోనికి ఎన్ని కళలలో ప్రావీణ్యం ఉంటుందో సిద్ధార్థ అని మనం ఎరిగిన కవిలో కూడా అన్ని కళలూ ఉన్నాయి. అతడు సంగీతకారుడు, నృత్యకారుడు, చిత్రకారుడు కూడా. అందుకే తన కవిత్వంలో మనం వాద్యఝరి, నాట్యగత్తె వొంటి మెరు పులు, విరుపులు, చిత్రకారుడి ఇమేజరీ చూస్తాం. అంటే కవి మన చెంతకు మారువేషంలో వచ్చాడన్న మాట. సిద్ధార్థను కేవల కవిగా భ్రమించే సావకాశం చూపరులకు ఉంది కనుక ఆదిలోనే అసలు సంగతి చెప్పక తప్పలేదు.
తెలుగు కవిత్వం పాఠకులకు ఇది సరికొత్త అనుభవం. మున్నెన్నడూ ఇట్టి కవిత్వాన్ని వారు చూసి ఎరుగరు. తెలు గునాట ఎనిమిది దశాబ్దాలుగా నాటుకుని స్థిరపడి ప్రాచు ర్యంలో ఉంటూ వస్తున్న ఒకానొక కవిత్వేతర భావజాలం బాధితులే అందరూ. అందువల్లే ముందుగానే తోవ సాఫ్ చేసే పనిలో భాగంగా కఠినంగా అనిపించినా కొన్ని కఠోర వాస్తవాలు చెప్పక తప్పటం లేదు. భావాలతో నిర్మించడానికి కవిత్వం తత్వం కాదు. తాత్వికులే ఒకవైపు భావాల తాలూకు భారాన్ని మోయడానికి నిరాకరిస్తూ భావజాల అనంతర విన్యాసాలకు విస్ఫోటనాలకు సిద్ధపడి కొత్త పుంతలు తొక్కు తుంటే మన కవులు మాత్రం సోకాల్డ్ భావాల రాపిడికి నలిగి పోతూ.... అస్తిత్వాన్ని కోల్పోతూ కొరగాకుండా పోతున్న దుస్స హ సన్నివేశం చిరకాలం మన కళ్లెదుట సాగుతూ వస్తున్నదే.
అభిజ్ఞ తాత్వికుడు విట్‌గెన్‌స్టయిన్ తత్వానికి భావాలతో పని లేదని అంతిమంగా తేల్చి చెప్పి వందేళ్లు పూర్తి కావస్తున్నది. తత్వం, మాటల పొందికతో మాట ప్రాతిపదికగా ఏర్పడిన భాషతో తత్వాన్ని నిర్మిస్తే తప్ప, తత్వశాస్త్రం శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావని ఆయన శాస్త్ర వేత్త మాదిరిగా సాధికారికంగా కనిపెట్టాడు. ఆయన మాటను కాదనగల ధీరుడు ఈ వందేళ్లలో ఒక్కడూ కానరాలేదు. కవు లు వాస్తవానికి తాత్వికుల కన్నా ఎంతో ముందుగా మేల్కొని ఉండాలి. పూర్వం అలాగే వుండేవారు. అంతేకాదు ముందు తరాల వారే కాదు, నిన్నా మొన్నటి దాకా కూడా కవులే దార్శనికులు. కవులకు ప్రత్యేకంగా దార్శనికుల దర్శనాలను సందర్శించాల్సిన ఆవశ్యకత వుండకపోయేది. చరిత్ర గతిలో ఎప్పుడూ కవులే పథగాములు. కానీ మన ’కర్మ’ కాలి కవులు వెనకబాట పట్టి తాత్వికులుగా చలామణిలో ఉంటూ ఊరేగే బూటకపు తత్వవేత్తలుగా ముందడుగు వేశారు.
జీవితం ఎప్పుడూ వాదం కానేరదు. అదే విధంగా వాదం జీవితం కాజాలదు. కానీ తెలంగాణ సహా తెలుగునాట అంత టా వాదాల హెూరు పిక్కటిల్లి జీవితం చచ్చుబడి పోయింది. అకాల పక్షవాతానికి లోనయింది. కాళ్లూ చేతులూ ఉండీ కదలలేని స్థాణువయింది. సజీవమైన నిత్య జీవితానుభవానికి ఏ వాదం ఆసరా అవసరం ఉండదు. అండదండల ఆవశ్యకత అసలే వుండదు. ఈ జీవన సత్యాన్ని గుర్తెరగక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వేళ్లూనుకుంటున్న తొలినాళ్లల్లో పాత బుద్ధులు వదులుకోలేని అశక్తులు ‘తెలంగాణ’ను ఆనాటికే కుప్పలు తెప్పలుగా వున్న వాదాల సరసన చేర్చి అటకెక్కించే విఫలయత్నం చేశారు. కానీ కాలం కడు నిశితమైనది. కాలం కుశాగ్రబుద్ధి. దాని అంచులు బహుపదును. అందుకే అంత కసరత్తు చేసీ, వాదాలు బరిలో ఓడిపోక తప్పలేదు. వాదంపై జీవితానిది పై చేయి అయింది. పరీక్షలో తెలంగాణ గెలిచింది.
సిద్ధార్థ నిజకవి కావడం వలన తన మాతృభాషకు, తన ప్రాంతానికి జరిగిన అపచారాన్ని, ఘోరకలిని స్వాభావికంగానే గ్రహించాడు. గ్రహించి ఊరకుండక తన పనివాడితనంతో కార్యరంగంలో అడుగుపెట్టాడు. తెలుగునాట ఇంకో అపప్రథ ప్రబలంగా వుంది. కావ్యం, కార్యం వేరు వేరు కాదు. కానీ వేరని అనుకుంటారు. కార్యం చేయకుండా కావ్యం పుట్టదన్న సంగతి వారికి తెలియదు. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవనే భ్రాంతిలో కూరుకుపోయి వుండటం మూలంగా కవులు... అంటే నిజంగా కవులు కాదు, కవులుగా ముద్ర వేసుకున్న వాళ్లు, వేయించుకున్న వాళ్లు కార్యరంగంలో ఉండేవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు కనబడుతూ కవితారంగాన్ని కార్యరంగం కన్నా ఉన్నతాసనంపై అధిష్టింపచేశారు. తద్వారా అటు కవిత్వాన్ని ఇటు కార్యశీలతను భంగపరిచారు. రెంటికీ చెడినారు. ఇంత విపత్తుకు కారణం తత్వానిది కవిత్వంపై పై చేయి కావడమే. కవి తన స్వాతంత్య్రాన్ని, స్వావలంబనను తద్వారా స్వాభిమానాన్ని కోల్పోవడానికి ఈ పరిణామం దోహదం చేసింది. అయితే కవులు మౌనంగా వుండలేదు. ప్రేక్షకపాత్ర పోషించడానికి ఇష్టపడలేదు. తెలుగు భాషలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కవులు ఈ రుగ్మతకు విరుగుడు కనిపెడుతూనే వస్తున్నారు.
కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, శిష్ట్లా, శ్రీరంగం నారాయణబాబు, పఠాభి, బైరాగి, అజంతా, ఇస్మాయిల్, మోహన్ ప్రసాద్ వంటి కవులు మన తెలుగులో ఈ పని ఫలప్రదంగా చేసి చూపారు. వర్తమాన సందర్భంలో సిద్ధార్థ ఈ పనికి పూనుకున్నాడు. తత్వంపై కవిత్వానిది పై చేయి చేసేందుకు పూర్వరంగం సిద్ధం చేశాడు.
2
The word poet literally means maker. Anything which is not well made does not exist Theophile Gautier.
కవిత్వం కూడా కార్యమేననే సత్యాన్ని తెలుసుకునేందుకు ఫ్రెంచి రొమాంటిసిజానికి ఆద్యుడు గాటియర్ చెప్పిన ఈ మాట తోడ్పడుతుంది. ఇతర అన్ని హస్తకళల మాదిరే కవిత్వకళలో రాణించాలంటే వృత్తి పనివాడితనం తప్పనిసరి అని అర్థం. వృత్తి పనివాడు చేసే వస్తువు అమరకపోతే తన అస్తిత్వాన్ని తక్షణమే కోల్పోతుంది. దానికి మనుగడ వుండదు. గాటియర్ మహాశయుడు కవిత్వానికి కూడా... అంటే కవి చేసే పనికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని చెబుతున్నాడు. కవిని కర్మచారిగా ఆయన చిత్రించింది ఇందుకే. కవికి వ్యుత్పత్తి అర్థం కూడా అదే. పొయెట్‌ని అందుకే మేకర్ అన్నాడు. గాటియర్ అనకపోయినా పొయెట్ అర్థం మారి వుండకపోయేది. తెలుగులో అచ్చకవుల సంఖ్య అత్యల్పంగా వుండటానికి కారణం ఇదే.
3
Siddharthas poetry is visual extravaganza and Bacchanalia. సిద్ధార్థ కవిగా వ్యక్తివాది కాదు. కానందువల్లే తన కవిత్వం నిండా ఉత్సవ సంరంభం. సిద్ధార్థ కవిత్వం నిండా మనుషులు. పంచేంద్రియాలతో తొణికిసలాడే ప్రాణమున్న మనుషులు. నిజానికి అతని కవిత్వం జవజీవాలు వుట్టిపడే మనుషులతో కిక్కిరిసి వుంటుంది. అందుకే సిద్ధార్థ కవిత్వంలోకి మనం ప్రయాణం చేసే ప్రతీసారీ పురా జాతరలో పాలుపంచుకుంటున్నట్టు వుంటుంది. ఇంగ్లిష్‌లో మన జాతర లను పట్టిచ్చే మాట ఒకటి ఉంది. కార్నివాల్ అంటారు వాళ్లు. జాతరను లేదా కార్నివాల్‌ను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అనుక్షణం జీవిస్తుంటారు. జాతరకు వెళ్లే ఆడా మగా, పిల్లా జెల్లా అక్కడ కేవలం ప్రేక్షకులుగా ఉండరు. ఉండజాలరు. ఉదాసీనత వారి ఎరుకలో వుండదు. అత్యంత క్రియాశీలంగా వుంటారు. అన్నింటినీ అనుభవిస్తుంటారు. తగురీతి పాత్రపో షణ చేస్తుంటారు. జాతరలో ప్రదర్శిస్తున్న వీధి బాగోతాలను చూడటంతో ఆగకుండా ప్రదర్శకులుగా మారిపోతారు. ఇదంతా వారికి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. సిద్ధార్థ కవిత్వం చదివే పాఠకుడి ‘దేహాత్మ’ స్థితి కూడా ఇదే. జాతరలో ఏదీ సవ్యంగా వుండదు. అంతా అపసవ్యమే. ఆ అపసవ్యత జాతర ప్రేక్షకుల్ని కట్టి పడేయటమే కాదు, కట్లు విప్పదీస్తుంది. దీనికి కారణం అనేకత్వం. బైరూపుల తనం. ఐక్యం కాని, కావడానికి ఇష్టపడని వైవిధ్యభరితమైన కంఠాలు, చేతనాచేతనాలు, స్పష్టాస్పష్టాలు, రూపారూపాలు బ్రహ్మం గారి స్థావర జంగమాలు... వెరసి పంచేంద్రియాల కేళీ కలా పం. ఏకోపాసనకు అక్కడ కించిత్తు స్థానం లేనందువల్లే ఈ అద్భుతం సాధ్యపడింది. ద్వైతాలు, బహుళాలు అక్కడ సంగ మిస్తాయి. వాద్యగాత్ర సంగీత ప్రవాహం అక్కడ కొత్త తోవలు తీస్తుంది. తన్మయత్వం తురీయావస్థకు చేరుకుంటుంది. ఫలితంగా రసోత్పత్తి జరుగుతుంది.
సిద్ధార్థ కవిత్వం చదివే పాఠకుడు కూడా ఈ అన్ని వికారా లను ఇష్టపూర్తిగా అదే అదనుగా అనుభవించి పలవరిస్తాడు. మనం అదిలోనే చెప్పుకున్నట్టు సిద్ధార్థ భాషను వాహకం చేసుకుని కవిత్వం చెప్పేపనిలో నిమగ్నమై ఉన్నందున అది కేవలం కవిత్వం అనుకోవద్దు. ప్రకృతిని అత్యంత ప్రాకృతంగా ఆవాహన చేయడం వల్లే కవికి ఇష్టదేవత ప్రాప్తించింది. గమ్మత్తు ఎక్కడుందంటే ఆ స్థితి పాఠకునికీ సిద్ధిస్తుంది. ఇంతా చేసి కవి ఇక్కడ చేసిందల్లా ఒక్కటే. అమూర్తమత్వాన్ని రోసి, మూర్తిమత్వానికి తన పయనం సాగించాడు. ఇది శైవం నుంచి జైనానికి, వైష్ణవానికి చేసే ప్రయాణం, పరివర్తనం. కర్మచారిగా కవి స్వాభావికంగానే మూర్తిమంతుడు కావడం వలన ఈ సంయోజనం (Fusion) కుదిరింది.
4
‘ఏడున్నరే... తోడుకోరేందే...
కవిత్వం ఏటవాలుగా కోస్తున్నదే...
తల్లీ... ఇదే సమస్తం...’ (బొమ్మలబాయి)
సిద్ధార్థ కవిత్వానికి తక్షణ నేపథ్యం తెలంగాణ. బొమ్మల బాయి కవిత తెలంగాణ అంతర్‌బహిర్ స్థితికీ, గతికీ మెటఫ ర్లలో అద్దం పడుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిం చవలసిన ‘కర్మకాండ’ను అక్షరాలా బద్ధుణ్ని చేసింది. బొమ్మ లబాయి పుస్తకంలోని ఎన్నో కవితలు (తొట్టెల, విదుఃఖిత కల, పెత్రమాస, గొంగడి, జిల్లేడుపొద, సింగాడ, భయచరాన, ఓరిత్తా, శివసత్తు, దుఃఖద్వేషం, కర్రెసామీ జంగపోడా, బొమ్మలబాయి) తెలంగాణ ఉద్యమ తీవ్రతకు తీరుతెన్నులకు బొమ్మగడతాయి. మరెన్నో కవితలు సుదూరంగా/ సమీపం గా, పరోక్షంగా/ ప్రత్యక్షంగా తెలంగాణ బతుకు చిత్రాన్ని మన కళ్లకు కడతాయి. తెలంగాణ జనజీవనాన్ని నిలువెల్లా ఆవరిం చిన నైరాశ్యాన్ని చిత్రికపట్టాయి. వైఫల్యాన్ని, దిక్కు తోచని స్థితిని అంతర్నిహితం చేసుకుని ముఖాముఖి ఎదుర్కొన్నాయి. తోవ దేవులాడే స్థైర్యాన్నిచ్చాయి. రూపంలో గాఢతను సాంద్రతను, తీక్షణతను సాధించాయి. సిద్ధార్థ కవిత్వతత్వ విచారం సంగెం కవితలో ప్రతిఫలిస్తుంది.
“కవిత్వమంటే వెనుకకు తిరిగి నడిచే కాంతి
ఎండిన తాలాబ్‌ల నెర్రెల్లోని
దక్షిణపు గాలి
యశోధరమ్మ గర్భసంచి
వొల్లంగి పిట్టె”.
తెలంగాణ జనం నాలుకల మీద నడయాడే నుడికారం కవిత్వంగా గమించడం ఓ పరమాద్భుతం. ఇన్నేళ్లలో తొట్ట తొలిసారి సంభవించిన నూతన శిశుజననం. తెలంగాణ జీవభాష కడుపారా కాచి కన్నబిడ్డ కవనగానం ఇది. దక్షిణ తెలంగాణ శూద్రజనుల పలుకుబడులను అజరామరం చేసిన అపురూప సందర్భం ఇది. సిద్ధార్థ కవిత్వాన్ని కొత్తగా ఒకటి రెండుమార్లు చదివిన పాఠకుని అనుభూతికి, మళ్ళీమళ్లీ వెనక్కి వెళ్లి పలుమార్లు చదివిన పాఠకుని అనుభూతికి మధ్య అంత రం చాలా హెచ్చుపాళ్లల్లో వుంటుంది. పాఠకుడి అనుభవంలో నిగ్గుదేరిన నిజం. దీనికి కారణాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కవిత్వం పొరలు పొరలుగా విడివడి వుండటం, భేదించనలవి కానంతగా కలగలసి వుండటం, కంటితో చదవడం మినహా చెవితో ఆలకించే సావకాశం లేకపోవడం, కవి అనుభవాలు జ్ఞాపకాల విస్తృతి అపారం కావడం వంటి ఎన్నో కారణాలు ఈ సంక్లిష్ట స్థితిని కల్పిస్తున్నాయి.
5
If the word does not exist, invent it: but first be sure it does not exist Baudelaire
సిద్ధార్థ కవిత్వం Lingual. లిఖిత భాష కాదు. నాలుక మీద ఆడే మాట. తెలుగు సంప్రదాయ కవిత్వంలోనే కాదు, ఆధునిక కవిత్వంలో కూడా మౌఖికానికి ఏనాడూ చోటు దక్కలేదు. లిఖిత భాషదే అక్కడ ఆధిపత్యం. కవులు ఎక్కువసార్లు లిఖిత భాషా సంప్రదాయం నుంచి జనించడం వల్ల ‘మార్గ’ం స్థిరపడిపోయింది. ‘దేశీ’ తోసివేతకు గురవుతూ వచ్చింది. ఇది కొత్త సంగతేం కాదు. అందరికీ తెలిసిందే. తెలిసినా ఫ్రీవర్స్‌ను (Verse Libre) భాషాపరంగా లిబరేట్ చేసేందుకు కవులు కొత్తగా చేసిందేమీ లేదు. వచన కవిత్వంగా మనం పిలుస్తున్న తెలుగు ఆధునిక కవిత రూపసారాల్లో ఆసాంతం మారిపోయినా, పాత మార్గానికే పరిమితమై జీవభాషకు దూరమైపోయింది.
కొంత ఆలస్యంగానైనా కోస్తా ప్రాంతపు కవికి భిన్నంగా తెలంగాణ కవి తన కవిత్వంలో దేశీ నడకను అవలంబించేం దుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నం బలహీనమై నది కావడం వల్ల ఆచరణలో ఫలించలేదు. కాళోజీ తన కవిత్వంలో దేశీ హొయలును చిత్తశుద్ధితో, కాన్షస్‌గా పుక్కిట పట్టాడు. కానీ కాళోజీ వారసులమని చెప్పుకునే వారెవరూ ఆయన తొక్కిన తోవలో నడవలేదు. అందుకు ప్రయత్నిం చనూ లేదు. కాళోజీ అనంతరం రంగ ప్రవేశం చేసిన ఇతరేతర కవులు సైతం కాళోజీ మార్గాన్ని అనుసరించలేదు.
తెలంగాణ ఆధునిక కవిత్వం ఆ విధంగా కాళోజీ కృషిని అందుకోక నష్టపోయింది. జీవభాష కావ్యభాష హెూదాను పొందలేకపోయింది. మౌఖిక భాషకు లిఖిత భాషకూ మధ్య చిరకాలంగా ఏర్పడిన ఈ పూడ్చలేని అగాథం ఆధునిక కవితను శుష్కింపచేసింది. సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్, వేముల ఎల్లయ్య, మునాస వెంకట్ వంటి కవులు రెండు దశాబ్దాల క్రితం కవిత్వంలో ‘దేశీ’ పతాకను ఎగురవేసిన తర్వాతే తెలంగాణ ప్రజల భాషకు కావ్య గౌరవం దక్కింది. ఆ విధంగా తెలంగాణ నవకవి విస్మృతిలో పడిపోయిన తన ఉనికిని చాటే తన భాషను తిరిగి కనుగొన్నాడు. నిజమైన కవి కవిత్వ పరిభాషను సదా కనిపెడుతూనే వుంటాడు. తెలంగాణ గడ్డమీద దళిత బహుజన సాంస్కృతిక సాహిత్య ఉద్యమం స్పష్టమైన రూపం తీసుకున్న నేపథ్యంలో జీవకవిత్వం పురుడు పోసుకుని కళ్లు తెరవడం గమనార్హం.
6
What is a poet? an unhappy person who conceals profound anguish in his heart but whose lips are so formed that as sighs and cries pass over them they sound like beautiful music.
పై Soren Kierkegaard
సిద్ధార్థ కవిత్వం దృశ్యమానంగా వుంటుందని అనుకు న్నాం. సారంలోనే కాదు, రూపంలో కూడా అది దృశ్య పరం పరను పాఠకుడి మనోనేత్రం ముందు ఆవిష్కరిస్తుంది. సిద్ధార్థ కవిత్వాన్ని స్థూలంగా చూసినపుడు ఎక్స్‌ప్రెషనిస్ట్ (అభి వ్యక్తివాదం) ధోరణి కనిపిస్తుంది. వేగుంట మోహన ప్రసాద్ కవిత్వం తలపున కొస్తుంది. అతడు రెండో మోహన్ ప్రసాద్ లా, తెలంగాణ మోహన్ ప్రసాద్‌లా మనకు గోచరిస్తాడు. అయితే ఇది పాక్షిక సత్యమే. సిద్ధార్థ కవిత్వం లోతుల్లోకి వెళ్లిన వారికి మాత్రం మోహన్ ప్రసాద్‌లో లేని మరేదో అంశ సాక్షాత్కరిస్తుంది. ఇందుకు బలమైన ప్రాతిపదిక ఆయన కవిత్వంలో నిక్షిప్తమై వుంది. సారాంశంలో ఈ కవి ఇమేజిస్ట్ అని తెలుస్తుంది. ఇమేజిజమ్‌గా (పదచిత్రవాదం) ప్రాచుర్యం లో ఉన్న ధోరణికి తెలుగులో ఇస్మాయిల్ అగ్రేసర ప్రతినిధి. అంటే ఏమిటి? ఈ కవిలో మోహన్ ప్రసాద్ కన్న మిన్నగా ఇస్మాయిల్ ఉన్నాడు. సిద్ధార్థ ఇమేజరీని సోదాహరణంగా (మచ్చుకి ... నిర్లయ, గన్నేరుపూల గాలి, విదుఃఖిత కల, తూనీగ కనుగుడ్డు, రెటీనాలో వాన, పిల్లతోవలు) చూపెడ తాయి. ఇమేజిస్టని నిరూపిస్తాయి.
7
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సాహిత్యంలో పాటదే పై చేయి. తెలంగాణ ప్రజలలో అత్యధికులు శ్రోతలు కావడమే ఇందుకు కారణం. కవిత్వానికి పాఠకులు తప్పనిసరి. అంతర్గత వలస పుణ్యమా అని స్థిరపడిన తెలంగాణ వెనుకబాటుతనం మూలంగా ప్రజలు ఆధునిక విద్యకు దూరమైపోయిన సంగతి తెలిసిందే. అయితే జానపద హృదయ సంస్కారాన్ని తెలంగాణ ప్రజానీకం ఎన్నడూ వీడలేదు. అది వారి వెన్నంటే ఉంటూ వచ్చింది. అదీగాక విషయ గ్రహణంలో చెవి ముందు కన్ను అత్యంత బలహీనమైనది. చెవికి ఉన్న శిక్షణ ఈనాటిది కాదు. కంటితో జ్ఞాన సముపార్జన ఇటీవలి పరిణామం. పాటే గాదు, చివరికి కవిత్వమైనా వింటేనే వొంటికి/ పెయ్యికి పడుతుంది. ప్రజాదరణ పొందడంలో పాట ముందంజను ఒప్పుకోలేని కవులు తమ కవిత్వమే పాటకన్నా గొప్పదని భావించే స్థితి కొంతకాలంగా నెలకొని వుంది. అట్లాగే పాట రాయడంలో అధికారం సాధిం చిన వాగ్గేయకారులు పాటే గొప్పదని భావించే పరిస్థితి కూడా నెలకొనివుంది. పాటకూ కవితకూ మధ్య ఈ విధంగా అనవసరమైన స్పర్ధ తక్కువ మోతాదులోనైనా ఉనికిలో వుందనేది కాదనలేని వాస్తవం. ఈ స్పర్ధను అధిగమిస్తూ ఒక సఖ్యత రూపు దిద్దుకుంటున్న హృద్గమనంలో ఉన్నాం మనం. మన వరసిద్ధుడు గోరటి వెంకన్న కవిత్వాన్ని పాట కడుతుంటే, సదాగతుడు సిద్ధార్థ పాటను కైకడుతున్నాడు. ఆధునిక తెలుగు కవితా సీమలో ఇదొక రసలీల. నవ ప్రత్యూష వేళ.
***
‘కవిత్వం ఒక తీరని దాహం’ అని మహాకవి శ్రీశ్రీ ఊరకే అనలేదు.
వాక్యమంటే చిందు బాగోతమయ్యా...
దాని రక్తమారదు పెనురక్త చాపం
దాని గొంతెప్పుడూ జియాగూడ కబేల
గన్నేరుకాయల్ని తంగేడు మొగ్గల్ని
డొక్కలో కుక్కుకుంటుంది
దాన్నే పాము కాటేసిందో
దాన్నే కొరకాలిప్పుడు దూప.. దూప... సైసుబిడ్డా... దూప... అని సంగెం కవితలో సిద్ధార్థ సకారణంగానే అంటున్నాడు.
What is genius? Recovery of childhood at will - Rimbaud
* తెలంగాణ జనం నాలుకల మీద నడయాడే నుడికారం కవిత్వంగా గమించడం ఓ పరమాద్భుతం. ఇన్నేళ్లలో తొట్టతొలిసారి సంభవించిన నూతన శిశుజననం. తెలంగాణ జీవభాష కడుపారా కాచి కన్నబిడ్డ కవనగానం ఇది.
* తెలంగాణ ఆధునిక కవిత్వం కాళోజీ కృషిని అందుకోక నష్టపోయింది. జీవభాష కావ్యభాష హెూదాను పొందలేకపోయింది. మౌఖిక భాషకు లిఖిత భాషకూ మధ్య చిరకాలంగా ఏర్పడిన ఈ పూడ్చలేని అగాథం ఆధునిక కవితను శుష్కింపచేసింది.
* జానపద హృదయ సంస్కారాన్ని తెలంగాణ ప్రజానీకం ఎన్నడూ వీడలేదు. అది వారి వెన్నంటే ఉంటూ వచ్చింది.
సిద్ధార్థ ‘బొమ్మలబాయి’ కవిత్వం నుంచి... ముందుమాట: రచనా కాలం - 2015