హైదరాబాద్,(విజయక్రాంతి): అదానీ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీ మాటే.. మా మాట అన్నారు. చట్టప్రకారమే తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కూదిరిందని, చట్ట వ్యతిరేక వ్యాపారాలను రాష్ట్రంలోకి అనుమతించామని మహేష్ కుమార్ తేల్చిచెప్పారు. అదానీకి తెలంగాణలో గుంట భూమి కూడా ఇవ్వలేదని, కానీ అమెరికా అధికారులు అదానీ కుంభకోణాన్ని బయటపెట్టారన్నారు. అదానీ దాదాపు రూ.2 వేల కోట్ల మేర లంచాలు పంచారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండదండలతోనే అదానీ అవినీతి సామ్రాజ్యం కొనసాగిందని మహేష్ కుమార్ ఆరోపించారు.
మోదీ ప్రధాని అయ్యాకే అదానీ సంపద వంద రెట్లు పెరిగిందని, రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ముఖ్యమంత్రులను జైల్లో వేశారన్నారు. అదానీ అవినీతిపై అమెరికా చెప్తున్న మోదీ పట్టించుకోవట్లేదని మహేష్ మండిపడ్డారు. అదానీని అరెస్టు చేసి.. జేపీసీ ద్వారా అతని అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆరోపణల్లో ఎవరి పేరు ఉన్నా సరే విచారణ జరిపించాల్సిందే అని చెప్పారు. స్కిల్ వర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు రేవంత్ రెడ్డి జేబులోకి పోలేదని, ఇప్పుడు స్కిల్ వర్సిటీకి కేటీఆర్ రూ.50 కోట్లు ఇచ్చినా తీసుకుంటామని చమత్కరించారు. సోలార్ పవర్ సహా అదానీ ఇతర వ్యాపారాలపైనా విచారణ జరపాలని కోరారు. అదానీ వ్యవహారంలో సెబీ పూర్తిగా విఫలమైందని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఛైర్ పర్సన్ ను బీజేపీ తొలగించలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.