హైదరాబాద్: సోనియా గాంధీ.. లేనిదే తెలంగాణ లేదని గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రదాత.. ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ 78 వ జన్మదినోత్సవ వేడుకలను డిసెంబర్ 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ది పనులను కాంగ్రెస్ ఏడాదిలో చేసి చూపించిందన్న మహేష్ కుమార్ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
అధికారం కోల్పోయిన కేటీఆర్ అహంకార ధోరణి వీడలేదన్నారు. కేటీఆర్ పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. లక్షల కోట్లు దోపిడీ చేసిన మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందన్నారు. తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన హెచ్చరించారు.
దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ కుటుంబమని ఆరోపించారు.బీఆర్ఎస్ హయంలో స్వేచ్చ కొరవడింది.. సీఎం రేవంత్ హయంలో స్వేచ్ఛకు కొదువ లేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్న టీపీసీసీ అధ్యక్షుడు చట్టం ఎవరికి చుట్టం కాదని వివరించారు. పదేళ్ల నిరంకుశ పాలనకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరుకూడ ఉండలేని పరిస్థితి వస్తుందని జోస్యం చేప్పారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సరిగ్గా సరిపోయే పేరు కిస్మత్ రెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీకి పేదల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిని ఫాం హౌస్ లో బంధించి కేటీఆర్, హరీష్ పిల్ల చేష్టలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వెల్లడించారు.