ముంబయి: మహారాష్ట్రలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడితో సరికొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వాహనతయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ బుధవారం వెల్లడించింది. ఛత్రపతి శంభాజీనగర్‌లో గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టయోటా ఒక ప్రకటనలో తెలిపింది. కర్నాటకలోని ప్రధాన కార్యాలయంతో పాటుగా ఇప్పటికే బెంగళూరు సమీపంలోని బిదాడిలో రెండు తయారీ యూనిట్లను సంస్థ కలిగి ఉంది. కర్నాటకలో ఉన్న ఈ సంస్థ దాని గ్రూపు సంస్థల్లో సహా రూ.16 వేల కోట్లకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. టయోటాకు సంబంధించి ఎగుమతుల విలువ సుమారు రూ.32 వేల కోట్లుగా ఉన్నయి. టయోటా ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లలో 3.42 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.