calender_icon.png 25 September, 2024 | 6:00 PM

ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి విష రసాయనాలు?

09-09-2024 01:18:05 AM

  1. ప్రధాన మురుగునీటి కాలువలో కలుస్తున్న వైనం 
  2. కళ్ల మంటలు, ఒళ్లంతా దద్దుర్లతో పరుగులు తీసిన జనం 
  3. గోదావరిఖనిలో ఘటన

పెద్దపల్లి, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వెలువడిన  విషపూరిత  రసాయనాలతో జనం ఒక్కసారిగా హడలెత్తిపోయారు. రామగుండం నగరపాలక సంస్థ 35, 13, 12 డివిజన్ల పరిధిలోని ప్రధాన మురికి నీటి కాలువలోకి ఈ రసాయనాలను మళ్లించారు. దీంతో ఇళ్లో ఉన్న వారికి కళ్ల మంటలు, తల నొప్పి, ఒళ్లంతా దద్దుర్లు రావడంతో భయాందోళనతో  బయటకు వచ్చా రు. ఇరుగుపొరుగు అందరూ ఇదే సమస్యతో బయటకు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.

సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీ నుంచి హానికరమైన రసాయనాలు ప్రధాన మురికి నీటి కాలువలో కలవడం గుర్తించి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు  బొడ్డు రజితరవీందర్, రాకమ్ లతదామోదర్ ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులను ఫోన్ ద్వారా ప్రశ్నించారు. అధికా రులు బుకాయించడంతో ప్రజలతో కలిసి ఆందోళనకు దిగారు. గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అక్కడికి చేరుకొని కాలువలోని శ్యాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తర్వాత ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు దిగివచ్చి మురికి నీటి కాలువలోకి వస్తున్న రసాయనాలను నిలిపివేశారు.