14-03-2025 01:00:56 AM
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు కూల్చివేత
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇల్లు నేలమట్టం
మరో పెంట్ హౌస్ కూల్చివేత
రాజేంద్రనగర్, మార్చి 13 (విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలపై రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు పంజా విసిరారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను గురువారం నేలమట్టం చేశారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్పల్లి డివిజన్లో ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఐదు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
అదేవిధంగా అత్తాపూర్ డివిజన్ పరిధిలోని అంబియన్స్ ఫోర్ట్ లో అనుమతులు ఒకలా తీసుకొని మరో విధంగా నిర్మించిన నిర్మాణాన్ని కూడా కూల్చి వేసినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ పేర్కొన్నారు. దీంతోపాటు రాజేంద్రనగర్ డివిజన్లోని ఉప్పరపల్లి లో చైతన్య విల్లాస్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక పెంట్ హౌస్ ను కూల్చివేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రవికుమార్, ఏసిపి శ్రీధర్ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా పర్మిషన్ ఒక విధంగా తీసుకొని ఓ విధంగా నిర్మిస్తే కూడా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిర్మాణదారులు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు.