- గెలుపుకి ఏడు వికెట్ల దూరంలో భారత్
- ఆసీస్ లక్ష్యం 534.. 12 పరుగులకే 3 వికెట్లు
- రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 487/6 డిక్లేర్
- కోహ్లీ, జైస్వాల్ సెంచరీల మోత
పెర్త్ టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. స్వదేశంలో కివీస్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ను మరిపించేలా కంగారూలపై భారీ గెలుపు అందుకునేందుకు ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. అంతకముందు భారత యువ కెరటం జైస్వాల్ మెరుపు సెంచరీకి తోడు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ శతకంతో రఫ్పాడించిన వేళ భారత్ తొలి టెస్టులో పట్టు బిగించింది.
కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ అప్పుడే మూడు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ విజయంతో టీమిండియా బోర్డర్ గావస్కర్ సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని ఆశిద్దాం.
2 - టెస్టుల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడిగా జైస్వాల్ (22 ఏళ్ల 330 రోజులు) రికార్డు. కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు) తొలి స్థానంలో ఉన్నాడు.
2 - ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ (7 శతకాలు) రికార్డు. తొలి స్థానంలో జాక్ హాబ్స్ (9 సెంచరీలు) ఉన్నాడు.
పెర్త్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో భారత్ విజయానికి దగ్గరైంది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన మన బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగిపోవడంతో టీమిండియా భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మూడు పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత కెప్టెన్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ విజయానికి మరో 522 పరుగులు అవసరం కాగా.. మ్యాచ్ ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. పిచ్ పేసర్లకు విపరీతంగా అనుకూలిస్తుండడంతో నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఆసీస్ ఆట ముగిసేలా కనబడుతోంది. అంతకముందు రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా.. విరాట్ కోహ్లీ (143 బంతుల్లో 100 నాటౌట్) చాన్నాళ్ల తర్వాత శతకంతో అలరించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ 2 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్, కమిన్స్, మార్ష్ ఒక్కో వికెట్ తీశారు.
కోహ్లీ దనాధన్..
172/0 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 62.5 ఓవర్లలో 200 పరుగుల మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో జైస్వాల్ 205 బంతుల్లో సెంచరీ మార్క్ సాధించాడు. అనంతరం 77 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ (25)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
275/1తో భారత్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ అనంతరం పడిక్కల్ ఔటవ్వడంతో భారత్ రెండో వికెట్ నష్టపోయింది. ఈ దశలో జైస్వాల్‌కు కోహ్లీ జత కలిశాడు. జైస్వాల్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించగా.. కోహ్లీ అతనికి సహకరించాడు. యశస్వి చూస్తుండగానే 150 మార్క్ దాటాడు.
డబుల్ సెంచరీ చేస్తాడనుకుంటున్న తరుణంలో జైస్వాల్ మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 161 పరుగుల ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. జైస్వాల్ ఔటైన అనంతరం ఆటలో దూకుడు పెంచిన కోహ్లీ యథేచ్చగా బ్యాట్‌ను ఝలిపించాడు. ఈ క్రమంలో పంత్, జురేల్‌లు నిరాశపరిచారు. సుందర్ (29) సాయంతో కోహ్లీ పరుగులు రాబట్టాడు.
ఆ తర్వాత వచ్చిన హైదరాబాదీ నితీశ్ కుమార్ (38 నాటౌట్) మరోసారి ఆకట్టుకోగా.. అతడి సహకారంతో కోహ్లీ టెస్టుల్లో 30వ శతకాన్ని అందుకున్నాడు. కోహ్లీ సెంచరీ సాధించిన వెంటనే బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ ముంగిట 534 పరుగుల కష్టసాధ్యమైన టార్గెట్‌ను ఉంచింది.
టపాటపా వికెట్లు..
కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మెక్‌స్వీనీ పరుగుల ఖాతా తెరవకుండానే బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ దశలో నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన కమిన్స్ (2)ను సిరాజ్ బోల్తా కొటించాడు. మరో ఓవర్‌లో ఆట ముగుస్తుందనగా మార్నస్ లబుషేన్ (3)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా పెవిలియన్ చేర్చాడు.
దీంతో ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంతలో మూడో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఆసీస్ భరతం పట్టి టీమిండియా భారీ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.