calender_icon.png 6 November, 2024 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులరహిత సమాజం వైపు..

15-08-2024 12:47:03 AM

ఓబీసీ మాత్రమే కాకుండా దేశంలోని అన్ని కులాలు, ఉప కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలి. దీంతోపాటు దేశంలో ఎంతమంది పేదలు, ధనికులు ఉన్నారన్నదానిపై ఆర్థిక సర్వే కూడా నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, అమలును వాయిదా వేసింది. కానీ, మహిళలకు రాజకీయాలతోపాటు ఉపాధి, ఉద్యోగ, ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రైవేటు, ప్రభుత్వరంగ కంపెనీల డైరెక్టర్ల పదవుల్లోనూ మహిళా రిజర్వేషన్ ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గాలుగా విభజించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉన్నదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశంలో రిజర్వేషన్లపై మరోసారి పెద్దఎత్తున చర్చ మొదలైంది. ఈ తీర్పుతో ఇప్పటివరకు రిజర్వేషన్లు పొందలేకపోయిన వర్గాలకు ఇకపై ఆ ఫలాలు అందుతాయని కొందరు వాదిస్తుండగా, ఈ తీర్పు రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేసేందుకు దారి తీస్తుందని మరికొన్ని వర్గాలు అంటున్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు భారతీయ సమాజంలో వేల ఏండ్లుగా నిరాదరణకు గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాలను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు విద్యా, ఉద్యోగాల్లో వారికి పదేండ్ల కాలానికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.

తదనంతనం ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక ప్రగతిలో పెద్దగా మార్పు రాకపోవటంతో పొడిగించక తప్పలేదు. రాజ్యాంగం అమల్లోకి రాకముందే డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ ఓ కీలక సూచన చేశారు. ‘ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం సాధ్యం కాదు’ అని తేల్చి చెప్పారు. నిజానికి ఆర్థికంగా ఎదగకుండా సామాజికంగా, రాజకీయంగా ఎదగటం అసాధ్యమని మనదేశంలో ఇప్పటికే నిరూపణ అయ్యింది.

ఇక సుప్రీంకోర్టు తీర్పులో ఇప్పుడు ప్రధానంగా వివాదాస్పదం అవుతున్నది ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కూడా క్రీమీలేయర్‌ను అమలుచేయాలన్న సూచన. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకొని రిజర్వేషన్లను వర్గీకరించాలి. అలా చేసే క్రమంలో క్రీమీలేయర్‌ను అమలుచేస్తే ఎస్సీ, ఎస్టీల్లోని కొందరు రిజర్వేషన్లకు అనర్హులు అవుతారు. దీనిపై కేంద్రంలోని అధికారంలో ఉన్న ఎన్డీ యే ప్రభుత్వంలోని కొన్ని పార్టీలు కూడా వ్యతిరేకత వ్యక్తంచేశాయి.

దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌ను అమలుచేయబోమని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా క్రీమీలేయర్ విధానాన్ని వ్యతిరేకించారు. రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నా.. ఎస్సీ, ఎస్టీల్లో ఇప్పటికీ రిజర్వేషన్లు వాడుకోలేకపోతున్న వర్గాలవారికి న్యాయం జరిగి తీరాల్సిందే. ఆ క్రమంలో రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించేటప్పుడు ఎవరికీ అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలి. 

మనదేశంలో ప్రతి పదేండ్లకోసారి జనా భా లెక్కల సేకరణ జరుగుతున్నది. కానీ, 2011 తర్వాత ఇప్పటివరకు జనగణన జరుగలేదు. కేంద్ర ప్రభుత్వం జనగణన గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొంతకాలంగా ఓబీసీ జనగణన చేపట్టాలని పలు రాజకీయ, సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నా మోదీ సర్కారు వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు సందర్భం, అవసరం వచ్చింది కాబట్టి వెంటనే జనగణన చేపట్టాలి. ఓబీసీ మాత్రమే కాకుండా దేశంలోని అన్ని కులా లు, ఉప కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలి. దీంతోపాటు దేశంలో ఎంతమంది పేదలు, ధనికులు ఉన్నారన్నదానిపై ఆర్థిక సర్వే కూడా నిర్వహించాలి. 

కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, అమలును వాయిదా వేసింది. కానీ, మహిళలకు రాజకీయాలతోపాటు ఉపాధి, ఉద్యోగ, ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రైవేటు, ప్రభుత్వరంగ కంపెనీల డైరెక్టర్ల పదవుల్లోనూ మహిళా రిజర్వేషన్ ఉండాలి. 

క్రీమీలేయర్ పరిధిలోకి వచ్చేవారు అంటే రిజర్వేషన్లను వాడుకొని ఆర్థికంగా ఎదిగినవారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లను వదిలేసి తమ సామాజికవర్గంలో తమకంటే దిగువన ఉన్నవారికి చేయూతనందించాలి. వారు తమంత తాముగా ఓపెన్ కోటాకు బదిలీ అయితే వెనుకబడిన వర్గాల్లో మరింత మంది రిజర్వేషన్లను వాడుకొని ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. 

మనదేశం నుంచి ఎంతోమంది మేధావులు, ధనవంతులు ఇతర దేశాలకు వలస పోతున్నారు. దేశంలో తమకు ఎంచుకొన్న రంగంలో ఎదిగేందుకు అవరోధాలు అధికంగా ఉన్నాయని భావించటం వల్లనే మేధో వలస పెరుగుతున్నది. వ్యాపార సరళీకరణ ద్వారా ఈ అవరోధాలను ప్రభుత్వాలు తొలగించేందుకు మరింత కృషి చేయాలి. అప్పుడే మేధో వలసలను ఆపగలం. దేశం వదిలి వెళ్లినవారిని కూడా తిరిగి రప్పించేందుకు వీలవుతుంది. 

ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ముఖ్యం గా ప్రభుత్వాలు కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలను మరింత పెంచి సరైన సమయంలో అందజేయాలి. 

వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వావలంబన చేకూరి, సమాజిక వివక్ష తొలగిపోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. అయితే, ఈ రిజర్వేషన్లను కట్టుదిట్టంగా అమలుచేసి, సంబంధిత వర్గాలను వేగంగా వృద్ధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు 10 ఏండ్ల కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. 70 ఏండ్ల నుంచి రిజర్వేషన్లు ఉన్నా.. వాటి అమలులో చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే ఆయా వర్గాలు ఇంకా వృద్ధిపథంలోకి రాలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇకపై ఆ పొరపాట్లు జరుగకుండా సరిదిద్దాలి. 

కొన్ని సందర్భాల్లో ఆర్థిక అంశాలను కూడా పక్కనబెట్టి కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. అంతిమంగా రిజర్వేషన్ల లక్ష్యం కుల రహిత సమాజం కావాలి. అందుకోసం ప్రభుత్వాలతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరి పరిధిలో వారు కృషి చేయాలి. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి