calender_icon.png 30 April, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క శ్మీర్‌లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత

30-04-2025 01:10:38 AM

  1. సరిహద్దుల్లో ఆగని పాక్ కాల్పులు
  2. పహల్గాం దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాది పాక్ మాజీ పారాకమాండో!
  3. రాడార్ వ్యవస్థల్ని మరో చోటికి తరలిస్తున్న పాక్!
  4. పాక్ అనుకూలురు దేశం వదిలేసి అక్కడికే వెళ్లాలన్న పవన్ కల్యాణ్
  5. నేడు మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం 

అనంతనాగ్, ఏప్రిల్ 29: జమ్మూకశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కశ్మీర్‌లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్టు తెలిపింది. దీంతో ముందు జాగ్రత్తగా జమ్మూలోని 87 పర్యాటక ప్రాంతాలకు గానూ 48 ప్రదేశాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

పర్యాటకులే లక్ష్యంగా రాబోయే రోజుల్లో మరిన్ని దాడులకు ముష్కరులు పథకం రచిస్తున్నారని తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి. పర్యాటక ప్రాంతాలను మూసివేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. పర్యాటకులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

శ్రీనగర్, గందేర్‌బాల్ జిల్లాల్లోని సీఐడీకి చెందిన వ్యక్తులు, కశ్మీరి పండిట్లు, పర్యాటకులను పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ లక్ష్యంగా చేసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ వర్గాల మేరకు ఉగ్రవాదులు ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్‌లో మరిన్ని దాడులు చేసి పెద్ద మొత్తంలో రక్తపాతం సృష్టించాలని చూస్తున్నారు. ప్రస్తుతం పహల్గాం దాడితో సంబంధమున్న ఉగ్రవాదుల ఇండ్లను సైన్యం కూలుస్తోంది.

ఈ కూల్చివేతలకు ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ఉగ్రమూకలు భావిస్తున్నాయని సమాచారం. లోయలో ఉండే స్థానికేతర రైల్వే సిబ్బందిపై, రైల్వే ఆస్తులపై ఉగ్రవాదులు దాడులు చేయొచ్చని కూడా హెచ్చరికలు చేశారు. రైల్వే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీలు తెలిపాయి. సున్నిత పర్యాటక ప్రాంతాలైన గుల్‌మార్గ్, సోనామార్గ్, ధాల్ సరస్సు తదితర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను మరింత పెంచారు.

పోలీసులతో పాటు భద్రతా బలగాలు కూడా అక్కడ మోహరించాయి. దూశ్‌పత్రి, కోకెర్నాగ్, అచ్చాబల్, బాంగస్ లోయ, తోసా మైదాన్, ఆస్తాన్‌పొర, కౌసరాంగ్, దూద్‌పత్రి, రింగావళి తంగ్‌మార్గ్, హబ్బా కథూన్ పాయింట్, కన్వర్ మొదలైన పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. 

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

పాక్ ఆర్మీ సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. సోమవారం రాత్రి కూడా జమ్మూలోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు అధికారులు ప్రకటించారు. అయితే పాక్‌సైన్యం కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిచ్చిందని వారు పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరపడం ఇది వరుసగా ఐదో రోజు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ వరుసగా కాల్పులు జరుపుతూనే ఉంది. 

రాడార్ వ్యవస్థలు తరలిస్తున్న పాక్! 

భారత్ మైమానిక దాడులు చేయొచ్చని భయపడుతున్న పాకిస్థాన్ తన వద్దనున్న రాడార్ వ్యవస్థలను సియాల్‌కోట్ ప్రాంతానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేసిన పాక్.. ఇప్పుడు రాడార్ వ్యవస్థల్ని కూడా తరలిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ వద్ద టీపీఎస్ రాడార్ సైట్‌ను దాయాది దేశం ఏర్పాటు చేసింది. భారత్ తమపై ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. 

వారిపై పవన్ ఆగ్రహం 

పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడే వారిపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా మాట్లాడాలనుకుంటే పాక్‌కు వెళ్లి మాట్లాడాలని సూచించారు. మంగళగిరిలో  ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్ భారత్‌లో భాగం. ఓట్లు, సీట్ల కోసం ఇటువంటి విషయాలు మాట్లాడకూడదు.

కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన తరఫున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నా. ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు? ఉగ్రవాదులు మతప్రాదిపదికన 26 మంది పర్యాటకుల్ని చంపారు. మన హిందువులకు ఇదొక్కటే దేశం. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. 

నేడు మరో కీలకభేటీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం కానుంది. ఇది వరకే ఒకసారి భేటీ అయిన కమిటీ బుధవారం మరోసారి భేటీ అవనుంది. ఇప్పటికే భారత చర్యలతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నేడు జరిగే భేటీలో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయో.. 

ఆ ఉగ్రవాది పాక్ మాజీ పారా కమాండోనే!

పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్టు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఒకడైన షహిమ్ మూసా పాక్ సైన్యంలో మాజీ పారా కమాండో అని అధికారుల దర్యాప్తులో తేలింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి మూసా పని చేస్తున్నట్టు దర్యాప్తు బృందాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడికి అతడే మాస్టర్ మైండ్‌గా దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.

పారా మిలటరీలో పని చేసిన మూసా కోవర్ట్ ఆపరేషన్లు చేయడంతో పాటు అత్యాధునిక ఆయుధాలు వినియోగించడంలో మంచి దిట్ట. ఎటువంటి ఆయుధాలు లేకుండా తలపడటంలో కూడా మూసా శిక్షణ పొందాడు. 2023లోనే మూసా భారత్‌లోకి ప్రవేశించి ఉంటాడని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న వందలాది మందిలో 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ మూసాకు ఉన్న సైనిక నేపథ్యం ధ్రువీకరించినట్టు అధికారులు తెలిపారు. మూసా పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరే తోయిబాలోకి సహాయకారిగా వచ్చినట్టు తెలుస్తోందని ఓ అధికారి వెల్లడించారు. మూసా ఇప్పటికే మూడు దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.