calender_icon.png 28 September, 2024 | 6:59 AM

పర్యాటక మూసీ

28-09-2024 03:19:54 AM

  1. నదీ పరీవాహక ప్రాంతంలో చారిత్రక కట్టడాలను పునరుద్ధరిస్తాం
  2. కట్టడాల పరిరక్షణకు ముందుకు రండి
  3. పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ పిలుపు
  4. నగరంలోని మెట్ల బావుల పరిక్షణకు ఒప్పందాలు
  5. ప్రభుత్వంతో పలు సంస్థల ఎంవోయూలు

హైదరాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): మూసీనది పరీవాహక ప్రాంతా న్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నదని తెలిపారు. నది వెంబడి ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకాన్ని పెంచుతామని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని పురాతన మెట్ల బావులను పరిరక్షించి పర్యటక కేంద్రాలు తీర్చిదిద్దేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఇందుకోసం ప్రభుత్వంతో సీఐఐతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థలు అవగాహన ఒప్పందాలు చేసుకొన్నాయి. సీఎం రేవంత్ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎంవోయూలపై సంతకాలు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌లోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నా యని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, అందులో త్వరలోనే శాసన మండలి ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం శాసన మండలి ఉన్న జూబ్లీ హాల్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉందని, ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని సీఎం వివరించారు. జూబ్లీహాల్‌ను దత్తత తీసుకొని పరిరక్షించాలని సీఐఐకి సీఎం సూచించారు.

అలాగే, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు భవనాలను కూడా పరిరక్షిస్తామని తెలిపారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందని గుర్తు చేశారు.

కార్యక్రమంలో రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.

మెట్ల బావుల దత్తత ఇలా..

బావి దత్తత తీసుకొన్న సంస్థ

మహాలఖా మెట్ల బావి ఇన్పోసిస్ 

సాలార్‌జంగ్, అమ్మపల్లి బావులు భారత్ బయోటెక్

మంచిరేవుల మెట్ల బావి సాయి లైఫ్ 

అడిక్‌మెట్ మెట్ల బావి దొడ్ల డెయిరీ

ఫలక్ నుమా మెట్ల బావి టీజీఆర్టీసీ

రెసిడెన్సీ మెట్ల బావి కోఠి ఉమెన్స్ కాలేజీ