డెహ్రాడూన్,(విజయక్రాంతి): ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు గర్వాల్ నుండి కుమావోన్ వెళ్తున్్న ఓ బస్సు అదుపుతప్పి అల్మోరాలోని మార్చుల వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడిన సమయంలో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఓవర్ లోడ్ వల్లే బస్సు లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని పాండే చెప్పారు. ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారిపట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. "అల్మోరా జిల్లాలోని మార్చులాలో జరిగిన దురదృష్టకర బస్సు ప్రమాదంలో ప్రయాణీకుల ప్రాణనష్టం గురించి చాలా విచారకరమైన వార్త వచ్చింది. సహాయక చర్యలు మరియు రెస్క్యూ కార్యకలాపాలను వేగంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి సూచించబడింది" అని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.