calender_icon.png 3 October, 2024 | 8:08 AM

బుద్ధిస్ట్ సర్క్యూట్‌లకు పర్యటక సొబగులు

03-10-2024 02:15:34 AM

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టూరిజం శాఖ కసరత్తు

నాగార్జునసాగర్‌లో పూర్తయిన పలు అభివృద్ధి పనులకు టెండర్లు

అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): దేశీయ, ప్రపంచస్థాయిలో టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. రాష్ట్రంలోని బుద్ధిస్టు పర్యాట క ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఇందులో భాగంగా విడతల వారీగా వాటిని అభివృద్ధి చేసే కార్యచరణకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలోని పలు చారిత్రక నేపథ్యమున్న బౌద్ధ పర్యాటక ప్రాంతాలను బుద్ధి స్టు సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని ప్రభు త్వం గత నెల సంకల్పించింది. ముఖ్యంగా బౌద్ధ మతం వ్యాపించి ఉన్న ఆసియాలోని తైవాన్, చైనా, జపాన్ లాంటి దేశాల పర్యటకులను ఆకర్షిండమే లక్ష్యంగా ప్రభుత్వం బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా మొదటగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వద్ద మౌలి క వసతుల కల్పనకు పర్యటక శాఖ చర్యలు చేపట్టింది. అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచిన టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఇప్పటికే ఏజెన్సీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ తర్వాత నేలకొండాపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

నేలకొండాపల్లిలోని ముజ్జుగూడెంలో

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో ఉంది. ఈ బౌద్ధక్షేత్రానికి చారిత్రక నేపథ్యం ఉంది. అందుకే దీని విశిష్టతను మరింత పెంచేందుకు పర్యటక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం పాలసీ తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రపంచస్థాయిలో పర్యటకులను ఆకర్శించేందుకు ఇక్కడ వసతులు కల్పించేందుకు సిద్ధమవుతోంది. రోడ్లు, మౌలిక సదు పాయాల కల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాగార్జునసాగర్ తర్వాత ఈ ప్రాంతంలోని అభివృద్ధి పనులపై టెండర్లకు పిలిచే అవకాశం ఉంది.

ఈ ప్రాంతాలను కూడా.. 

బౌద్ధమతం ఆరంభం నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆ భావజాలం ప్రాచుర్యంలో ఉండేదని పలు ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రం లో బౌద్ధం విరాజిల్లిందనడానికి పలు ప్రాం తాల్లో బయటపడ్డ స్థూపాలే నిదర్శనం. నేలకొండాపల్లి, నాగార్జునసాగర్‌తో పాటు ఫణి గిరి, కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్, గాజులబండ, మునులగుట్ట, పాశిగం, తంబాలపల్లి, చైతన్యపురి, కొలనుపాక, గూడూరు, గీసుకొండ, ఇప్పగూడెం, దేవునిగుట్ట, చాడ, తిరుమలగిరి, వర్ధమానుకోట, నాగారం, అరవపల్లి, తుమ్మలగూడెం, గోపాలయపల్లి, అమంగల్, పజ్జూరు, ముదిగొండ, నాగులవంచ, ఏలేశ్వరం ప్రాంతాల్లో బౌద్ధ స్థూపాల ఆనవాళ్లు బయటపడ్డాయి. నేలకొండాపల్లి, నాగార్జునసాగర్ మాదిరిగానే మిగతా ప్రాం తాలను కూడా బుద్ధిస్టు సర్క్యూట్ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసే దిశగా పర్యటక శాఖ కసరత్తు చేస్తోంది.

కాటేజీల అభివృద్ధి.. ఆర్‌ఓ ప్లాంట్

247 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో మౌలిక వస తుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిం ది. టూరిజం కార్పొరేషన్ ఇక్కడ 6 కాటేజీల ను అభివృద్ధి చేయనుంది. అలాగే బుద్ధవ నం ప్రాజెక్టులో పిల్లల ఆట స్థలాల అభివృద్ధి, సామగ్రిని అందించాలని నిర్ణయించింది.

రిజర్వాయర్ నుంచి చరిత వనంతో పాటు ఇతర పార్కులకు నీటి వసతి కోసం పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడికి దేశవ్యాప్తంగా, ప్రపంచ స్థాయిలో టూరిస్టులు వస్తారన్న ఉద్దేశంతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలతో కూడిన సమాచార సూచిక బోర్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు.

అంతేకాకుం డా సుప్రసిద్ధ కంపెనీలకు చెందిన రెండు కాఫీ షాప్‌లను అలాగే, ఆర్‌ఓ ప్లాంట్ గది, బ్లూ స్టార్ వాటర్ కూలర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభమ య్యే అవకాశం ఉంది.