calender_icon.png 25 October, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక తెలంగాణ

13-08-2024 12:58:54 AM

  1. ప్రపంచ పటంలో స్థానం కల్పిస్తాం
  2. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ
  3. నేలకొండపల్లి అభివృద్ధికి సహకరిస్తాం: పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించి ప్రపంచ పటం లో స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సహచర మంత్రులతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకొని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు.

పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి మండలంలో మొదలైన మంత్రుల పర్యటన ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో సాగింది. ఈ ప్రాంతంలో ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు. కిన్నెర సాని నుంచి భద్రాచలం వరకు అడవులు ఎకో టూరిజానికి అనువుగా ఉంటే, నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపం మొదలు జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారామాచంద్రస్వామి ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. 

పాలేరు నియోజకవర్గంలో..

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని భట్టి సందర్శించారు. భక్త రామదాసు జన్మించిన స్థలం కావడంతో మ్యూజియంలో ఆయన చిత్రమాలికను తిలకిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని, చాలినన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఉన్న పంచాయతీరాజ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపం 1వ శతాబ్దం నాటిదని, దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని వివరించారు.

ఇది 8 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. అండర్‌గ్రౌండ్‌లో ఆనాటి శిలలు ఉన్నాయ ని, ప్రసిద్ధ బౌద్ధ ప్రదేశంగా ఎంపిక చేయాలన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు మందిరం అభివృద్ధి చేయాల్సిన అవసరముందని కోరారు. ఈ మేరకు బౌద్ధ స్తూపం, భక్తరామదాసు మందిరంతో పాటు పాలేరు జలాశయం అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చి దిద్దుతామన్నారు. బౌద్ధ ఆరామాల వద్దకు జపాన్ లాంటి దేశాల నుంచి బౌద్ధ మతస్థులను ఆహ్వానిస్తామన్నారు. మంత్రి జూపల్లి నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం దేదీప్యమానంగా వెలుగుతోందన్నారు.

కిన్నెరసాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని కిన్నెరసాని పర్యాటక కేంద్ర అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధిపై అద్యయనం చేసిన ఆయన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వరల్డ్ బెస్ట్ కన్సల్టెన్సీకి కిన్నెరసాని అభివృద్ది పనులు కేటాయించి  అద్బుతంగా తీర్చిదిద్దుతామన్నారు. కావ్యా ల్లో, అనేక గ్రంథాల్లో కిన్నెరసాని ప్రస్తావన ఉందన్నారు.

చుట్టూ పచ్చని చెట్లు మద్యలో విశాలమైన నీటి వనరు పర్యాటక ప్రాంతం గా అభివృద్దికి కిన్నెరసాని ప్రాజెక్టు అన్ని రకాలుగా అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత నీటిపారుదలశాఖ, ఫారె స్టు, జెన్‌కో,  పర్యాటక, ఇతరుల సమన్వయంతో అభివృద్ది చేస్తామన్నారు. వరల్డ్ బెస్ట్ కన్సల్టెన్సీని ఎంపిక చేసి కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి పనులు అప్పగించే ఆలోచనలో ఉన్నామన్నారు.

అధికారులు ఖమ్మం జిల్లా రిపోర్టు పంపితే  కేంద్ర నిధులతో  సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామ న్నారు. పర్యాటక పటంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అద్బుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి  కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మేల్యేల కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, సత్తుపల్లి ఎమ్మేల్యేలు  కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు,  జారే ఆదినారాయణ, మట్టా రాగమయి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు తదితరులు  పాల్గొన్నారు. 

రోప్‌వేకు ఆమోదం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని కోటను మంత్రులు సందర్శించారు. కోటపైకి ఎక్కి పరిసరాలను తిలకించారు. ఈ సందర్భంగా కోటకు రోప్‌వే  కావాలని సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడంతో రోప్‌వే  నిర్మాణానికి పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  వెంటనే అనుమతులు ఇస్తూ సంతకం చేశారు. త్వరలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని భట్టి తెలిపారు.