calender_icon.png 30 January, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10లోగా టూరిజం పాలసీ

30-01-2025 02:01:24 AM

  • అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలి
  • ఎంఎన్‌సీల పెట్టుబడులు వచ్చేలా చూడాలి
  • పర్యాటక అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలో గా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రా ష్ర్టంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యా లు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సూచించారు. తె లంగాణ రాష్ర్ట సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

దేశీయంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పర్యాటక పాలసీలతో పాటు అంతర్జాతీయంగా ప్రముఖ పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. దేశీయ పర్యాటకులనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించాలన్నారు.

పర్యాటక రంగంలో బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని తెలిపారు. ఎంఎన్‌సీలు పెట్టుబడులు పెట్టినప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడతాయని.. అప్పుడు పర్యాటకుల ఆకర్షణ సులువవుతుందన్నారు. 

సఫారీ టూరిజం..

తెలంగాణలో కవ్వాల్, ఆమ్రాబాద్ పులు ల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సమ్మక్క రామప్ప దేవాలయం, లక్నవరంను సర్క్యూట్‌గా తీర్చిది ద్దాలని, నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ల్లో కేరళ తరహాలో బోట్ హౌస్‌ల ద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలని సూచించారు. రాష్ర్టంలో బౌద్ధ పర్యాట క ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు.

సమ్మక్క-సారక్క జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే లా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సింగపూర్ వంటి దేశాలు తక్కువ ప్రదేశంలో వైవిధ్యమైన ప్రణాళికలతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. 

నగర పార్కుల సర్క్యూట్..

హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ స్కువాక్, సర్య్యూట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వసతులు మెరుగుపర్చాలని సూచించారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాకుండా పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం పెరిగితేనే రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని సీఎం తెలిపారు.

సమీక్షలో రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ర్ట పర్యాటకాభివృద్ధి సంస్థ చైైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు  శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, సీఎస్ శాంతికుమారి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట: సీఎం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

తిరుమలలో మాదిరిగానే యాదగిరిగుట్టలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు మార్పులు సూచించారు.

సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. 

అప్పటి ఇందిరమ్మ ఇళ్లు ఏమైనయ్?

సీఎం రేవంత్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో 2004 నుంచి 2014 వరకు జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ దోషులను శిక్షించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎమ్ పద్మనాభరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలోని సుమారు 12వేల గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం జరిగినా సీఐడీ అధికారులు కేవలం 36 గ్రామాల్లోనే విచారణ చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జులై 26, 2014లో సీఐడీ విచారణకు ఆదేశించినా ఇంకా నిందితులపై చర్యలు తీసుకోలేదన్నారు. ఈవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పేరిట వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినా, పదేళ్లుగా ఎటువంటి విచారణ జరుపక దస్త్రాన్ని పక్కన పడేసినట్లు ఆరోపించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. తప్పు చేస్తే శిక్షపడుతుందన్న భయం ఉండాలని చెప్పారు.