అధ్యయనం పూర్తి
- దసరా లోపు విధివిధానాలపై స్పష్టత
- భారీగా పెట్టుబడులు ఆకర్షించే విధంగా పాలసీ
కొడవలికంటి నవీన్ :
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టూరిజం పాలసీని ప్రకటించనున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత పర్యాటక రంగం నిరాదరణకు గురైందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. పాలసీ రూపకల్పన కోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.
అధికారుల బృందం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలపై అధ్యయనం చేసిన పర్యాటక శాఖ వర్గాలు తెలిపాయి. వాటిపై నివేదికను సైతం సిద్ధంచేసే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించాయి. సర్కార్ ఆ నివేదికను పరిశీలించి ఇక పాలసీని ఫైనల్ చేసి ప్రకటించాల్సి ఉంటుంది. పాలసీ రూపకల్పనలో భాగంగానే బెంగళూరులో జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ తరహాలోనే అనంతగిరి అటవీ ప్రాంతంలోనూ నేచర్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నది. అలాగే రాజధానిలో ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మంచి పాలసీ తీసుకువచ్చేందుకు అవసరమైతే ఇతర దేశాల్లోని బెస్ట్ టూరిజం పాలసీలనూ అధ్యయనం చేయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
పాలసీ అనివార్యం
ఏ రంగమైన అభివృద్ధి చెందాలంటే దానికి ఓ పాలసీ ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం రంగాలకు పాలసీలు అనివార్యం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది ? రాయితీలు ఉన్నాయా? ఒక సంస్థ శంకుస్థాపన మొదలు నుంచి ఉత్పత్తి బయటకు వెళ్లే వరకు ప్రభుత్వం అందించే మద్దతును ఆ పాలసీ స్పష్టంగా వివరిస్తుంది. ఏ సంస్థ అయినా పాలసీని చూసే పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తుంది. గత ప్రభుత్వం పర్యాటక పాలసీల రూపకల్పనపై పెద్దగా దృష్టి సారించలేదు.
పది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కొత్త సర్కారు టూరిజం పాలసీల రూపకల్పనపై స్పెషల్ ఫొకస్ పెట్టింది. ఒక రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం ముఖ్యమైంది. పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ కల్పనలో టూరిజం ముఖ్యభూమిక పోషిస్తుంది. అందుకే దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక పాలసీలను రూపొందించుకుని సక్సెస్ అవుతున్నాయని ఐఐటీటీఎం వంటి కొన్ని టూరిజం రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి.
పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాలసీలు..
కేరళ: బాధ్యతాయుతమైన టూరిజం, సస్టునబుల్ టూరిజం నినాదంతో కేరళ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. సామాజిక, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం 2012లో టూరిజం పాలసీని ప్రతిపాదించింది. ప్రధానంగా హౌస్‌బో ట్, బ్యాక్ వాటర్ టూరిజం, ఆయుర్వేద వెల్ నెస్ టూరిజం, పర్యావరణం, ఆరో గ్యం, గ్రామీణ టూరిజానికి తమ పాలసీలో ప్రత్యేక పాలసీలను ప్రకటించింది.
గోవా: గోవా అనగానే అందరికి గుర్తొచ్చేది బీచ్. అందుకే అక్కడి ప్రభుత్వం బీచ్, అడ్వెంచర్ టూరిజం టార్గెట్‌తో పాలసీని తీసుకొచ్చింది. బీచ్, అడ్వెంచర్‌తో పాటు సాంస్కృతిక పర్యాటకానికి పెద్దపీట వేసింది. టూరిజంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలతో ఆతిథ్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ)లో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
గుజరాత్: సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా గుజరాత్ ప్రభుత్వం టూరిజం పాలసీని తీసుకొచ్చింది. రాన్ ఆఫ్ కచ్ నుంచి గిరి నేషనల్ పార్క్ వరకు టూరిజం కారిడార్‌ను ప్రతిపాదించింది. సాంస్కృతిక, పర్యావరణ, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తమ పాలసీలో ప్యాకేజీలను ప్రకటించింది. ఎయిర్ ట్రావెల్ కనెక్టివిటీని పెంచింది. జోరో కాస్ట్ ఎంట్రీ స్కీంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి.
మహారాష్ట్ర: అడ్వెంచర్, కల్చరల్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెడుతూ 2004లో నాటి ప్రభుత్వం టూరిజం పాలసీని ప్రతిపాదించింది. తర్వాత ప్రభుత్వాలు కాలానికి అనుగుణంగా పాలసీలో మార్పులు చేశాయి. రాక్ క్లుంబింగ్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్‌తో పాటు అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ 2016లో తీసుకొచ్చిన పాలసీ ప్రస్తుతం అమలవుతున్నది.
రాజస్థాన్: 2020లో రాజస్థాన్ హెరిటేజ్, కల్చరల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పాలసీని ప్రకటించింది. కోటలు, రాజ భవనాలు, పండగలు, చారిత్రక వారసత్వాన్ని ప్రోత్సహించే విధంగా పాలసీని తీసుకొచ్చింది. చారిత్రక భవనాలను హోటళ్లుగా మార్చింది. ఏడారిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
* ఒడిశా: సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, టూరిజం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం 2022లో నూతన పాలసీని ప్రకటించింది. కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ ఆలయంతో పాటు ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యాలతో ఒడిశా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ఆ సర్కారు జోరో కాస్ట్ ఎంట్రీ స్కీంను ప్రతిపాదించింది. ఈ స్కీమ్ కూడా విజయవంతంగా నడుస్తోంది.
రాష్ట్రానికి అనుకూలమైన అంశాలు ఇవీ..
టూరిజం అభివృద్ధిలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలమైన అవకాశాలు తెలంగాణకు ఉన్నాయి. అడ్వెంచర్, సినిమా, రిలీజియస్, ఎకో, నేచర్, వారసత్వ, సాంస్కృతిక, టూరిజం సర్క్యూట్లు తెలంగాణ పర్యాటక రంగానికి గొప్ప వరం. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. అందుకు అనుకూలమైన విధానాలను రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక కట్టడాలు, లక్నవరం సరస్సు, కుంతల, బొగత జలపాతాలు, పోచారం, కిన్నెరసాని అభయారణ్యాలు, ఫిల్మ్ సిటీ, షూటింగ్‌లు, స్టూడియోల వీక్షణ, ట్రెక్కింగ్, రాక్ క్లుంబింగ్, పారా గ్లుడింగ్ వంటి సాహస యాత్రలు, బుద్ధవనాలు, వరంగల్, నాగార్జాన సాగర్ వంటి సర్క్యూట్లు.. ఇలా ఎన్నో పర్యాటక అనుభూతులకు ఆలవాలంగా రాష్ట్రం ఉంది. వీటి ఆధారంగా తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పాలసీని ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
విధివిధానాలపై కసరత్తు జరుగుతోంది
కొత్త టూరిజం పాలసీల విధివిధానాలపై ప్రభుత్వం కసర్తతు చేస్తోంది. పీపీపీ మోడ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే యోచనలో సర్కార్ ఉంది. ఊరికే పాలసీ ప్రకటించి వదిలేయకుండా స్థిరత్వాన్ని కొనసాగిస్తాం. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ఇమేజ్ తెస్తాం. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారినే కాకుండా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పిస్తాం. పెట్టుబడులను ఆకర్షిస్తాం.
జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి