- టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లకు దేవాలయాలతో అనుసంధానం
- ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన టెంపుల్ టూరిజం
- డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు అనువైన ప్రదేశాలను గుర్తించండి
- తెలంగాణలో టూరిజం అభివృద్ధికి అపార అవకాశాలు
- పర్యాటక పాలసీపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
* తెలంగాణలో టూరిజం అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. ఈనెల 31 లోగా టూరిజం పాలసీ తయారు చేయాలి. కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించాలి. టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లను దేవాలయాలతో అనుసంధానించాలి. రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలి.
ఉస్మానియా ఆస్పత్రిని అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. చార్మినార్‌కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్‌లో అభివృద్ధి అయ్యేలా చూడాలి. విదేశాల తరహాలో షాపింగ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
సీఎ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఈనెల 31వ తేదీలోగా టూరిజం పాలసీని తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి టూరిజం పాలసీపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా టూరిజంపై రూపొందించిన ఫిల్మ్ పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. గత పదేళ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీని తయారు చేయలేదన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న టూరిజం పాలసీలను సీఎంకు అధికారులు వివరించారు. సొంత కాళ్లపై నిలబడేలా పాలసీని పర్యాటక శాఖ తయారు చేయాలని సీఎం రేవంత్రెడడి సూచించారు.
అసెంబ్లీలో టూరిజం పాలసీని ప్రవేశపెట్టి సమగ్రంగా చర్చ జరిగేలా చూద్దామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. పాలసీ రూపకల్పనలో భాగంగా దుబాయ్, సింగపూర్, చైనా దేశాల్లో విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్నారు. తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్‌లో అభివృద్ధి అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వాతావరణం 365 రోజులు బాగుంటుందని, దానికి అనుగుణంగా టూరిజాన్నీ అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. చార్మినార్‌కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి
టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లను దేవాలయాలతో అనుసంధానించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రొటీన్ పర్యాటకం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించాలని సూచించారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చేలా వాతావరణాన్ని అధికారులు కల్పించాలని ఆదేశించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పల్ల రాష్ట్రంలో టెంపుల్ టూరిజం పెరిగిందని సీఎం తెలిపారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపైన అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.
అలాగే పర్యాటక శాఖ స్థలాల లీజులపైన సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. టూరిజం స్థలాలు, లీజులపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కోర్టు కేసులను సీరియస్ తీసుకొని స్టేలు ఎత్తివేసేలా అడ్వకేట్ జనరల్‌తో చర్చించి మంచి న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గుర్తింపు ఉన్న కంపెనీలకే పర్యటక స్థలాలు లీజ్‌కు ఇవ్వాలని స్పష్టం చేశారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, గ్రామీణ రోడ్లు బాగున్నాయని, అన్నిరకాల ఆహారం లభిస్తోందని తెలిపారు.
సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం శాఖ ఎండీ ప్రకాశ్ రెడ్డి, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.