నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం :
మానవుడు ఉరుకుల పరుగుల జీవితంలో సతమతమవుతున్న హైటెక్ యుగంలో తీరిక లేక పోటీ పోలికల చక్రబంధంలో చిక్కుకున్న ఆధునిక మానవునికి మానసిక ఉల్లాసం కలిగించి, విశ్రాంతిగా,జీవితం హుషారుగా, ఆనందంగా గడపడానికి, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించు కోవడానికి పర్యాటక రంగం దోహదపడుతున్నది. ప్రపంచాన్ని ఒకచోట చేర్చే సామర్థ్యం పర్యాటక రంగానికి ఉంది. అంతర్జాతీయ రంగంలో ఈ రంగం ప్రమేయం అనేక అంశాలలో సానుకూల వృద్ధిని పెంపొందిస్తున్నది.
దేశ ఆర్థికాభివృద్ధి,ఉపాధి కల్పనలో టూరిజం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య శాంతి,సామరస్యం, భౌగోళిక సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని,మెరుగైన దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి పర్యాటక రంగం బహుముఖ పాత్ర పోషిస్తున్నది.అభివృద్ధి చెందిన,అభివృద్ధి చెందుతున్న దేశాలలో పర్యాటక రంగం శీఘ్రంగా విస్తరిస్తుంది. మంచి రాబడులతో పర్యాటక రంగం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ పరిశ్రమగా వర్ధిల్లుతున్నది. మన దేశంలో పర్యాటక రంగం గణనీయమైన ప్రగతిని సాధించింది.
స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో పర్యాటక రంగం బహుముఖ పాత్ర పోషిస్తున్నది. దేశంలో శీఘ్రంగా విస్తరిస్తున్న సేవా రంగంలో పర్యాటక రంగం ప్రథమ స్థానం దక్కించుకోవడం గమనార్హం. ప్రభుత్వం పర్యాటక రంగానికి ఎగుమతుల పరిశ్రమ ప్రతిపత్తి, స్థాయిని కల్పించింది. మౌలిక వసతులు పెద్ద స్థాయిలో సమకూర్చడం వల్ల 2020లో వార్షిక స్థూల జాతీయ ఉత్పత్తిలో పర్యాటక రంగం వాటా 7 శాతం పైగా పెరిగింది.
విభిన్న ప్రదేశాలు, పర్యావరణం, ప్రకృతి, ప్రజల సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు వస్త్రధారణ వంటి విషయాలలో ఉన్న వైవిధ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఆయా దేశాల సాంస్కృతిక,నాగరికత ,చారిత్రక విషయాలను అందరికీ తెలియచేయడానికి 1980 నుండి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అన్ని దేశాలలో నిర్వహిస్తున్నది.
పెరిగిన విదేశీ పర్యాటకులు
ఇటీవల భారతదేశ ప్రభుత్వం ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ ప్రచారంతో మన దేశం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 6 వేల సంవత్సరాల మనదేశ నాగరికత విభిన్న సంస్కృతులు,ఆచారాలు, సంప్రదాయాలు,కళారూపాలు, వైవిధ్యభరితమైన జీవనవిధానాలు,సహజ సంపదలు,మనదేశ ప్రజల ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, మన నాగరికత విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఆధునిక కాలంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల దేశాల మధ్య టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు వైద్య చికిత్స కోసం మన దేశానికి రావడం వల్ల వైద్య టూరిజం గణనీయంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారు. గ్రామీణ పర్యాటక రంగానికి జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు వల్ల స్వదేశీ పర్యాటకులు సంవత్సరానికి 10 శాతం ,విదేశీ పర్యాటకులు 8 శాతం చొప్పున పెరుగుతున్నారు.
ఉపాధికి ఊతం
పర్యాటక రంగం ఆర్థికవ్యవస్థ పరిపుష్టికి తోడ్పడుతుంది. చాలామంది ఉపాధికి ఊతమిస్తుంది. భారత్ లో గత ఏడాది లెక్కల ప్రకారం పర్యాటక రంగం 4.26 కోట్ల మందికి ఉపాధి కల్పించింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి లో 9.2 శాతం మొత్తం పర్యాటక రంగం ద్వారానే సమకూరింది. గత ఏడాది పర్యాటకరంగం ద్వారా రూ. 16 లక్షల కోట్ల ఆదాయం లభించింది. 2029 నాటికి ఈ రంగం ఆదాయం రూ. 35 లక్షల కోట్లకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మనదేశ పర్యాటక రంగం ప్రస్తుతం 6.9 వార్షిక వృద్ధి రేటు నమోదు చేసుకున్నది.
గత ఏడాది దాదాపు కోటి మంది విదేశీ పర్యాటకులు మనదేశాన్ని సందర్శించారు. స్వచ్ఛ భారత్,పచ్చదనం,పరిశుభ్రత పాటించడం ద్వారా పర్యాటక రంగం లో ప్రగతి సాధ్యమౌతుంది. దేశంలో పర్యాటక ప్రదేశాలలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో పర్యాటక శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చి యువతకు ఉపాధి అవకాశాలు కలిగించాలి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగాఆకర్షించడానికి పర్యాటకరంగ అభివృద్ధికి సమగ్రమైన అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించాలి.
నేదునూరి కనకయ్య
పర్యాటకంలో టాప్ 10 దేశాలు
1. ఫ్రాన్స్ పర్యాటకుల సంఖ్య (8.9 కోట్లు)
2.స్పెయిన్ ( 8.3 కోట్లు )
3.అమెరికా (8.0 కోట్లు)
4.చైనా (6.3 కోట్లు)
5.ఇటలీ (6.2 కోట్లు)
6.టర్కీ (4.6 కోట్లు)
7.మెక్సికో (4.1 కోట్లు)
8.జర్మనీ (3.9 కోట్లు)
9. థాయిలాండ్ (3.8 కోట్లు)
10.యునైటెడ్ కింగ్‌డమ్ (3.6 కోట్లు)