calender_icon.png 15 October, 2024 | 4:42 AM

సర్కార్ విద్యాలయాల్లో టూరిజం క్లబ్‌లు

15-10-2024 02:37:09 AM

ఒక్కో క్లబ్‌లో 25 మంది విద్యార్థులు

పర్యాటకంపై అవగాహన పెంచేలా కృషి

మెదక్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): విభిన్న సంస్కృతులు, పర్యాటకం, పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో, కళాశాలల్లో యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

7వ తరగతి నుంచి 12 వరకు చదివే విద్యార్థులకు ఈ క్లబ్‌లో మెంబర్‌షిప్‌కు అవకాశం కల్పించనున్నారు. ఒక్కో పాఠశాల, కళాశాలలో 25 మంది విద్యార్థులతో క్లబ్ ఏర్పాటు చేయనున్నారు. విద్యతో పాటు టూరిజంపై సంపూర్ణ అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం దోహదపడనుంది.

క్లబ్‌లు దేశం, రాష్ట్రంలోని పర్యాటక రంగంతో పాటు రిలేటెడ్‌గా ఉన్న అంశాలపై దృష్టి సారిస్తాయి. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, విభిన్న కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యక్ష పద్ధతిలో ప్రదర్శన నిర్వహిస్తాయి. ప్రతి క్లబ్‌కు ఒక విద్యార్థి నాయకుడిగా బాధ్యతలు తీసుకుంటారు. ఒక ఉపాధ్యాయుడు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.  

టూరిజం క్లబ్ లక్ష్యాలు..

క్లబ్‌లు దేశం, రాష్ట్రంలోని విభిన్న సంస్కృతులు, భౌగోళిక పరిస్థితుల గురించి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తాయి. పర్యాటకం, పర్యావరణం, ప్రకృతితో స్నేహం, ప్రయాణ మనస్తత్వాన్ని నేటి యువతలో పెంపొందిస్తాయి. బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని పెంపొందించడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, శతాబ్దాలుగా ఉద్భవించిన సామూహిక మిశ్రమ సంస్కృతికి సంబంధించిన వేడుకలపై అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు.   

క్లబ్‌ల ఏర్పాటుకు కసరత్తు..

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు టూరిజంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతి క్లబ్‌లో 7వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఉండాలి. అన్ని తరగతుల నుంచి విద్యార్థుల సంఖ్య, బాలికల ప్రాతినిధ్యం సమానంగా ఉండాలి. జిల్లాలో క్లబ్‌ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. 

 రాధాకిషన్, 

జిల్లా విద్యాధికారి, మెదక్