calender_icon.png 25 April, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదంపై కఠిన చర్యలు

25-04-2025 01:19:26 AM

  1. అఖిలపక్ష భేటీలో హామీనిచ్చిన కేంద్రం
  2. నేడు జమ్మూకు వెళ్లనున్న రాహుల్ గాంధీ
  3. భద్రతా లోపాన్ని అంగీకరించిన హోంమంత్రి!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని కేంద్రం అఖిలపక్షనేతలకు హామీనిచ్చింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీ నిర్ణయాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. ‘ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం అన్ని పార్టీల నేతలకు హామీనిచ్చింది.

ఉగ్రవాదంపై పోరు లో ప్రభుత్వానికి పూర్తి మద్దతునిస్తామని అన్ని పార్టీల నేతలు చెప్పారు. అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో ఈ ఉగ్రదాడిని ఖండించారు. సమావేశం సానుకూల దృక్పథంతో ముగిసింది.’ అని రిజిజు వెల్లడించారు. అఖిలపక్ష భేటీ దాదాపు ఐదు గంటల పాటు జరిగింది. 

కేంద్రానికి పూర్తి మద్దతు: రాహుల్

‘కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి మద్దతునిస్తుంది. ఉగ్రవాదానికి ప్రతిస్పందనగా కేంద్రం ఎటు వంటి చర్య తీసుకున్నా ప్రతిపక్షం పూర్తి అండగా ఉంటుంది. ప్రతిఒక్కరూ పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు.’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నేడు రాహుల్ జమ్మూలో పర్యటించి ఉగ్రదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి అఖిలపక్ష సమావేశ ఆహ్వానం ఆలస్యంగా అందింది. గురువారం ఉదయం ఆయన దీనిపై ట్వీట్ చేస్తూ ‘గత రాత్రి నేను కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో మాట్లాడాను. ఆయన  కొన్ని పార్టీలకు చెందిన 5 లేదా 10 మంది ఎంపీలను పిలవాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు.

అన్ని పార్టీలను ఎందుకు పిలవడం లేదని నేను అడిగా? దానికి మంత్రి సమాధానమిస్తూ మీటింగ్ మరీ లెంగ్తీగా అవుతుందని తెలిపారు. మరి మా లాంటి చిన్న పార్టీల సంగతేంటని అడిగినపుడు నా స్వరం బిగ్గరగా ఉంటుంది అని మంత్రి చమత్కరించారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అనంతరం ఆయనకు ఆహ్వానం అంది అఖిలపక్షసమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్, నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఏఐఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, ఎన్సీపీ(ఎస్పీ) తరఫున సుప్రియా సూలే, ఎన్సీపీ తరఫున ప్రఫుల్ పటేల్, బీజేడీ నుంచి సస్మిత్ పాత్ర, టీడీపీకి చెందిన లావు శ్రీ కృష్ణదేవరాయలు, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, ఆప్ నుంచి సంజయ్ సింగ్, టీఎంసీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ, ఆర్జేడీకి చెందిన ప్రేమ్ చంద్ గుప్తా, డీఎంకే నుంచి శివ, ఎస్పీ నుంచి రామ్ గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. 

పహల్గాంలో భద్రతా లోపాన్ని అంగీకరించిన ప్రభుత్వం!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగేందుకు భద్రతా లోపమే కారణం అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిం చాయి. ‘ఏ తపూ్పు జరగకపోతే మనమంతా ఎందుకిక్కడ సమావేశం అయ్యాం. కొన్ని లోపాలను మేం గుర్తించాం’ అని సమావేశం సందర్భంగా అమిత్ షా ఇతర పార్టీ నేతలతో పేర్కొన్నారు. జమ్మూలో జరిగిన ఘటన, ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలను కేంద్ర పెద్దలు అన్ని పార్టీల నేతలకు వివరించారు. 

మోదీకి ఫోన్ చేసిన నెతన్యాహు

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు, ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇటలీ ప్రధాని మెలోని, జపాన్ ప్రధాని ఇషీబా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి తమ సంఘీభావం తెలియజేశారు.