పారిస్: ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు కఠిన డ్రా ఎదురైంది. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు బాక్సింగ్‌కు సంబంధించిన డ్రా విడుదల చేశారు. నేటి నుంచి బాక్సింగ్ పోటీలు షురూ కానున్నాయి. ఆదివారం తన పోరును ప్రారంభించనున్న నిఖత్ జరీన్ తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన మాక్సి కోల్టెర్‌ను ఎదుర్కోనుంది. ఈ బౌట్‌లో నెగ్గితే నిఖత్ తర్వాతి పోరులో టాప్ ర్యాంకర్ వూ యూ (చైనా)తో తలపడనుంది.
ఒకవేళ రెండో రౌండ్ అధిగమిస్తే క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్ బాక్సర్ ఛుతామత్ రక్సాట్ రూపంలో నిఖత్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. గత ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లవ్లీనాకు కూడా కఠిన డ్రా ఎదురైంది. తొలి బౌట్‌లోనే ఆమె నార్వే బాక్సర్ సున్నివా నొఫ్‌స్తాద్‌ను ఢీకొట్టనుంది. రెండో రౌండ్ నుంచి క్వార్టర్స్ వరకు లవ్లీనా చైనా బాక్సర్ల గండాన్ని దాటాల్సి ఉంది. ఇక పురుషుల విభాగంలో అమిత్ పంగల్, నిషాంత్ దేవ్‌లకు మాత్రం రౌండ్ ఆఫ్ 16కు బై లభించింది.