calender_icon.png 27 December, 2024 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టచ్ చేసి రూ.4.50 లక్షల దోపిడీ?

26-12-2024 03:14:01 AM

  • మృతదేహానికి చికిత్స చేసిన వైద్యులు?
  • మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రిలో ఘటన
  • ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

మంచిర్యాల, డిసెంబర్ 25 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని టచ్ ఆసుపత్రిలో వైద్యులు మృతదేహానికి వైద్యం చేసి, రూ.4.50 లక్షల బిల్లు వేశారు. ఛాతిలో నొప్పి వస్తుందని అడ్మిట్ అయిన వ్యక్తి 45 నిమిషాల్లోనే చనిపోయినా మృతదేహాన్ని అప్పగించకుండా రాత్రంతా ఆసుపత్రిలోనే ఉంచుని, రూ.4.50 లక్షల బిల్లు వేశారు. మృతదేహం కావాలంటే డబ్బులు మొత్తం కట్టి తీసుకెళ్లాలని ఇబ్బంది పెట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన కొంగ శ్రీనివాస్(45)కు మంగళవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో మంచిర్యాలలోని టచ్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, వెంటనే చికిత్స చేయాలని, అందుకు రూ.1.80 లక్షలు చెల్లించాలని బంధువులతో ఆసుపత్రి యాజమాన్యం ప్యాకేజీ కుదుర్చుకున్నది. వెంటనే రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయించుకున్నది. అయితే వైద్యులు చికిత్స ప్రారంభించిన 45 నిమిషాల్లోనే శ్రీనివాస్ చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.

రాత్రే శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకెళ్తామని బంధువులు చెబితే బుధవారం ఉదయం మృతదేహాన్ని ఇస్తామని వైద్యులు చెప్పడంతో ఆసుపత్రి వద్దే రోధిస్తూ కూర్చున్నారు.

రూ.4.50 లక్షలు చెల్లించాల్సిందే..

బుధవారం ఉదయం మృతదేహాన్ని తీసుకెళ్తామని ఆసుపత్రి యాజమాన్యం వద్దకు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వెళ్లగా బిల్లు రూ.4.50 లక్షలు అయ్యిందని, డిపాజిట్ చేసిన మొత్తాన్ని తీసివేసి మిగిలిన రూ.మూడు లక్షలు కట్టి తీసుకెళ్లాలని చెప్పడంతో అందరు అయోమయంలో పడ్డారు. ఆసుపత్రిలో ఉన్న మృతదేహానికి ఒక్క రాత్రి ఇంత బిల్లు ఎలా అయ్యిందని, చనిపోయిన వ్యక్తికి వైద్యం అందించారా అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆసుపత్రి యాజమాన్యం శ్రీనివాస్ మృతదేహాన్ని అప్పగించింది.