మనస్తాపంతో ఉరి వేసుకొని అటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్‌కర్నూల్, మే 17 (విజయక్రాంతి): తన ఆటోలో ప్రయాణించే ఓ మహిళా ప్రయాణికురాలు బంగారం నాను పోగొట్టుకోగా, అను మానంతో అటోడ్రైవరును దొంగతనం నింద మోపి విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర మనస్తాపంతో బాధితు డు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తెలకపల్లికి చెందిన నారిమళ్ల వెంకటయ్య (45) ఆటో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదే ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయా ణికురాలు వారం రోజుల క్రితం తన బంగారు నాను పోగొట్టుకుంది.
ఆమె కుమారుడు నాగర్‌కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఆటో డ్రైవరు వెంకటయ్యను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనులో విచారణ పేరుతో చిత్రహింసలకు పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదేరోజు రాత్రి సమయంలో తన భార్య అలివేలుకు అప్పజెప్పి మరుసటిరోజు మళ్లీ రావాలని ఆదేశించారు. శుక్రవారం మధ్యా హ్నం బయటికి వెళ్లివస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన వెంకటయ్య చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తమ బంధువులకు ఫోన్ చేసి పోలీసులు మళ్లీ పిలిచి చిత్రహింసలకు గురిచేస్తారని.. చేయని తప్పునకు తనను అవమానించారని బోరున విలపించాడు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సీఐ కనకయ్యను వివరణ కోరగా.. విచారణ కోసం పిలిచింది వాస్తవమేనని, కానీ కొట్టలేదంటూ సమాధానం ఇచ్చారు. విచారణ పేరుతో చావబాదిన నాగర్‌కర్నూల్ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.