న్యూఢిల్లీ, జూలై 7 : దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భాతర వాతావరణ శాఖ అప్రమత్తమైంది. రాబోయే 24 గంటల్లో ఢిల్లీ దాద్రీ, గ్రేటర్ నోయిడా, చర్కి దాద్రీ, మట్టన్ హైల్, పల్వాల్ ఔరంగాబాద్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. 8 నుంచి 10వ తేదీ వరకు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక, రాబోయే 2, 3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే ఐదు రోజుల పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు, అసోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. బ్రహ్మపుత్ర, బరాక్ లోయలతో అస్సాంలోని 35 జిల్లాల్లో 30 జిల్లాలు జలమయంగా మారాయి. 3,518 గ్రామాల్లో 24 లక్షల మందిని వరదలు ప్రభావితం చేశాయి. భారీ వర్షాల కారణంగా అసోంలో 58 మంది మరణించారు.
మహారాష్ట్రలో రైళ్ల రాకపోకలకు అంతరాయం..
మహారాష్ట్రలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. షాపూర్ ప్రాంతంలోని ఇళ్లు, వంతెనలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కళ్యాణ్, కనరహావే మధ్య రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ రాబోయే రె ండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
భారీ వర్షాలతో చార్‌ధామ్ యాత్ర నిలిపివేత
ఉత్తరాఖండ్‌లో ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రం లోని తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండు రోజుల పాటు చార్‌ధామ్ యాత్రను నిలిపి వేస్తూ గల్హార్ జిల్లా ఎస్పీ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు.