calender_icon.png 26 December, 2024 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తోపుడు బండి’ సాదిక్ ఇకలేరు

08-11-2024 12:20:20 AM

  1. గుండెపోటుతో హఠాన్మరణం
  2. కవులు, జర్నలిస్టుల సంతాపం

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ‘తోపుడు బండి’లో పుస్తకాలను విక్రయించడం ద్వారా ప్రసిద్ధుడైన సీనియర్ జర్నలిస్టు సాదిక్ అలీ (60) కన్నుమూశారు. మంగళవారం గుండెపోటుకు గురికాగా హైదరాబాద్ యశోదా దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన సాదిక్ ఉదయం పత్రికలో జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఉదయం సహా అనేక పత్రికల్లో వేలాదిగా రచనలు ప్రచురించారు. ఆయనకు భార్య ఉష, తోడబుట్టిన అక్క ఉన్నారు. 1964 జూన్ 3న కల్లూరులో జన్మించిన సాదిక్ చిన్నతనం నుంచీ అనేక కష్టాలు పడ్డారు.

కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో డిగ్రీ వరకు చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా పాల్గొనే వారు. 1980వ దశకంలో ‘ఉదయం’ దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు.

బాల్య స్నేహితురాలైన ఉషని ఆదర్శ వివాహం చేసుకున్నారు. 1990వ దశకంలో పలు వ్యాపార, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘వశిష్ఠ’ కలం పేరుతో  ‘యూనివర్సల్’ మ్యారేజ్ బ్యూరో స్థాపించడం ద్వారా వేలాదిమందికి పెళ్లి సంబంధాలు కుదిర్చారు.

తోపుడు బండితో వినూత్న కార్యక్రమం

‘తోపుడు బండి’పై పుస్తకాలను అమ్మే వినూత్న ప్రక్రియను విజయవంతంగా నడిపి, సాహిత్య లోకంలో సాదిక్ మంచి పేరు తెచ్చుకున్నారు. కథలు, కవిత్వం, సాహిత్య సంబంధమైన కొత్త పుస్తకాలను ‘తోపుడు బండి’పై వెళ్తూ విక్రయించేవారు. కూరగాయలు అమ్మినంత నిజాయితీగా, తేలిగ్గా వీధుల వెంట తిరుగుతూ ప్రజలకు వాటిని చేరువ చేశారు.

హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఏటా జరిగే ‘బుక్ ఫెయిర్స్’లోనూ ‘తోపుడు బండి’పై కొత్త పుస్తకాలను ప్రదర్శించడం విశేషం. కల్లూరు మండలంలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కావలసిన వస్తువులను దాతలనుంచి సేకరించి అందించేవారు. ఇందుకోసం కొన్నాళ్లుగా కల్లూరులోనే స్థిరపడ్డారు.

కొవిడ్ సమయంలో పేద విద్యార్థులకు సెల్‌ఫోన్లను ఉచితంగా అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు. చనిపోవడానికి ముందురోజు కూడా 200 మంది బాలబాలికలకు షూస్ ఇచ్చారని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ భోజనం ఏర్పాట్లు చేసి అందరి మన్ననలు పొందారని వారి కుటుంబ మిత్రుడు రియాజ్ పేర్కొన్నారు. 

పలువురి సంతాపం

మనుషులను ఉన్నదున్నట్టు బేషరతుగా ప్రేమించే వ్యక్తి సాదిక్ అని పత్రికా రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ తన ఎఫ్‌బీ పోస్టులో కొనియాడారు. బడి పిల్లల కోసం బరువైన (బాధ్యతతో) ‘తోపుడు బండి’ని చిరునవ్వుతో తోసుకెళ్లే వాడని సినిమా దర్శకుడు అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. ఇటీవలె ‘రొట్టమాకు రేవు’ అవార్డు సభకు వచ్చాడని, కల్లూరు పిల్లలకోసం నిరంతరం కృషి చేసేవారని కవి యూకూబ్ గుర్తు చేసుకున్నారు.

‘తోపుడు బండి’ని ఒక ‘గ్రామీణ విద్యా వికాస ఫౌండేషన్’గా మార్చి సేవ చేయడం అభినందనీయమని సీనియర్ జర్నలిస్టు ఘంటా చక్రపాణి కొనియాడారు. పుస్తకాల్ని పాఠకులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో వాటిని తోపుడు బండికి ఎక్కించాడని, హైదరాబాద్ నుంచి వందలాది కిలోమీటర్లు పుస్తకాల యాత్ర చేశాడని మరో పత్రికా రచయిత మణిభూషణ్ అన్నారు. 100 రోజుల్లో ఎండల్లో 1000 కిలోమీటర్లు ‘తోపుడు బండి’తో సాహిత్య ప్రయాణం చేసి సంచలనం సృష్టించాడని ‘కళ’ పత్రికా సంపాదకుడు డా.మహ్మద్ రఫీ తెలిపారు.