calender_icon.png 21 December, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలేపల్లి పంచాయితీలో రికార్డుల టాoపరింగ్

16-09-2024 03:22:27 PM

కొత్త సెక్రటరీ కి రెండు నెలలైనా రికార్డులు అప్పగించని పాత సెక్రటరీ

అనుమానం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని అధికారులు

జడ్చర్ల: జడ్చర్ల మండలం లోని పోలేపల్లి పంచాయితీ లో రికార్డులు టాoపరింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోనే అత్యంత కీలకమైన ఈ పంచాయితీ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే, పోలేపల్లి పంచాయితీ సెక్రటరీ గా శివప్రసాద్ గత ప్రభుత్వ హయాంలో దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు పని చేశారు. ఆయన సెక్రటరీ గా కొనసాగిన కాలం లో పంచాయతీ లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. వీటిలో  అక్రమాలు చోటు చేసుకున్నాయనే  ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే శివప్రసాద్ ను పోలేపల్లి నుంచి బదిలీ చేసి ఆయన స్థానంలో లక్ష్మీ నారాయణ ను సెక్రటరీ గా నియమించగా ఆయన పోలేపల్లి పంచాయితీ సెక్రటరీ గా గత జూలై నెల 20 వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పాత సెక్రటరీ పంచాయతీ కి సంబంధించిన రికార్డులు అన్నింటినీ కొత్త సెక్రటరీ కి అప్పగించాలసి  ఉండగా శివప్రసాద్ ఇప్పటి వరకూ ఆయనకు రికార్డులు అప్పగించలేదు. ఈ విషయం గా లక్ష్మీ నారాయణ జిల్లా పంచాయతీ అధికారి ఫిర్యాదు చేసినా రికార్డుల అప్పగింతకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తాను కూడా ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎంపీడీవో కు చెప్పినా ఇప్పటి దాకా ఎంపీడీవో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి  సోమవారం మీడియా కు విడుదల చేసిన ప్రకటన లో తెలిపారు. ఈ వ్యవహారంలో ఎంపీడీవో స్పందించకపోతే ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పోలేపల్లి పంచాయితీ లో గత నాలుగున్నర ఏళ్ల కాలంలో ఆరుకోట్ల దాకా ఆర్థిక లావాదేవీలు జరగ్గా వాటిలో అక్రమాలు జరిగినట్లు తనకు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. గతంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి రికార్డులను టాoపరింగ్ చేయడానికే రికార్డులను కొత్త సెక్రటరీ కి ఇవ్వడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకే గత ఐదేళ్ల కాలంలో పోలేపల్లి పంచాయితీ లో జరిగిన ఆర్థిక లావాదేవీల పై విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు అనిరుధ్ రెడ్డి వివరించారు. ఇప్పటికైనా పోలేపల్లి పంచాయితీ రికార్డులు కొత్త సెక్రటరీ కి అప్పగించడానికి సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్ డిమాండ్ చేశారు.

శృతి మరణం పై లోతుగా దర్యాప్తు

గచ్చబౌలి లోని రెడ్ స్టోన్ హోటల్ లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన  జడ్చర్ల కు చెందిన నర్సింగ్ విద్యార్థిని శృతి మృతిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పోలీసు అధికారులను కోరారు. జడ్చర్ల కు చెందిన శృతి మృతిపై ఎమ్మెల్యే గచ్చిబౌలి పోలీసుల తో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. శృతి మృతిపై ఆమె తల్లితండ్రులు అత్యాచారం, హత్య గా అనుమానిస్తున్న  నేపథ్యంలో ఈ సంఘటన పై లోతుగా దర్యాప్తు చేసి శృతి కుటుంబానికి న్యాయం చేయాలని అనిరుధ్ రెడ్డి పోలీసు అధికారులను కోరారు..