calender_icon.png 16 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం ఉత్పత్తిలో టాప్

16-11-2024 02:17:59 AM

మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తరువాత రైతు భరోసా

  1. రైతులను రెచ్చగొట్టేందుకు బీఆర్‌ఎస్ కుట్రలు
  2. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో గతంలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండేదని, అది ఈసారి 1.53 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయికి పెరిగిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో సన్నవరి సాగు  25లక్షల ఎకరా లు ఉండేదని, ఇప్పుడు 41 లక్షల ఎకరాలకు చేరిందన్నారు.

దొడ్డు రకాలు 41 ఎకరాలు ఉండేదని, ప్రస్తుతం 26 లక్షలకు ఆ పంట పడిపోయిందన్నారు. రాష్ట్రంలో 27 జిల్లాలో 7,411 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతుందని మంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన తరువాత  రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హమీలు దశల వారీగా అమలు చేస్తామని, ఇప్పటికే రూ. 2లక్షల రుణమాఫీ చేసి దేశంలో చరిత్ర సృష్టించామన్నారు. తాము చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ పార్టీ వారు అలాంటి చర్యలను మానుకోవాలని హెచ్చరించారు.

కృత్రిమ ఉద్యమాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మాట్లాడారు

. ఆర్థిక కష్టాలున్నా రైతులకు ఇచ్చిన హమీలు నేరవేస్తున్నామని, తాము ఇచ్చిన మాట ప్రకారం సన్నవరికి రూ. 500 బోనస్ ఇస్తామని, రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రూ. 2లక్షలకు పైగా అప్పు ఉన్న రైతులకు ఆర్థిక వెసులుబాటు చేసుకుని మాఫీ చేస్తామన్నారు. రైతుల కోసం పంట బీమా తీసుకొస్తామని, రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 

సన్నాలకు బోనస్ గ్యారంటీ

మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): పదేళ్ల  బీఆర్‌ఎస్ పాలనలో కేటీఆర్, హరీశ్‌రావు రైతులకు తీరని అన్యాయం చేశారని, తమ ప్రభుత్వం రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే ఓర్వలేక రైతు లను గందరగోళ పరిచే ప్రయత్నా లు చేస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు.

సన్నవడ్లకు బోనస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఖచ్చితంగా సన్నధాన్యం అమ్మిన రైతులకు వారంరోజు ల్లో బోనస్ అందజేస్తామని, అపోహలు అవసరం లేదన్నారు. ఇప్పటివరకు రూ.33 కో ట్లు బోనస్ చెల్లించినట్లు తెలిపారు. 

కేంద్రానికి రైతులపై ప్రేమ ఉంటే తేమ శాతం నిబం ధనలు మార్చాలని కోరారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా వారు రైతుల కో సం ఎలాంటి కృషి చేయడంలేదని విమర్శించారు. రైతులకోసం కాంగ్రెస్ పాటు పడు తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, వారిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

కేటీఆర్ అరెస్టు నాటకం

ప్రజల్లో సానుభూతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్టు అంటూ డ్రామాలాడుతున్నాడని మంత్రి అన్నారు. లగచర్ల ఘటనలో కలెక్టర్‌ను చంపే కుట్ర జరిగిందని, రైతుల విషయంలో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటలో ప్రమేయం ఉన్నవారిని ఎవరి వదిలిపెట్టమని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు.

రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, లగచర్ల ఘటనలో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు వారి పార్టీ నాయకులే చెబుతున్నారు. ఆయనను అరెస్టు చేయడానికి తాము ఎలాంటి కుట్రలు చేయడం లేదన్నారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తి అయ్యాక మరిన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.