calender_icon.png 6 March, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ వినియోగంలో టాప్

10-12-2024 01:28:59 AM

  1. ఎన్‌పీడీసీఎల్ కంటే గ్రేటర్‌లోనే అత్యధిక విద్యుత్ వినియోగం 
  2. నవంబర్ నెలలో ఎన్‌పీడీసీఎల్ కంటే 16 మిలియన్ యూనిట్లు అదనంగా వాడేసిన నగరప్రజలు
  3. గ్రేటర్‌కు ప్రత్యేక డిస్కం అవసరమంటున్న నిపుణులు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో సీజన్‌తో సంబంధం లేకుండా రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. సాధారణంగా విద్యుత్ వినియోగంలో వ్యత్యాసాలను రాష్ట్రంలో ఉన్న ఉత్తర, దక్షిణ కంపెనీలలో  ఒకదానితో ఒకటి పోలుస్తుంటారు.

ఇప్పటివరకూ మొత్తం ఎస్‌పీడీసీఎల్ పరిధిలో అత్యధిక వినియోగం అవుతున్నట్టుగా రికార్డు ఉండగా.. ప్రస్తుతం ఆ రికార్డును గ్రేటర్ హైదరాబాద్ పరిధి చెరిపేసింది. దీంతో ఓ కంపెనీ కంటే అత్యధికంగా విద్యుత్ వినియోగాన్ని నమోదు చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని పలువురు విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. 

గ్రేటర్‌లో రోజుకు 65.54 మిలియన్ యూనిట్లు...

గ్రేటర్ హైదరాబాద్‌లోని 9 సర్కిళ్ల పరిధిలో గత మూడేళ్లుగా విద్యుత్ వినియోగం అత్యధికంగా నమోదవుతోంది. 2022 మార్చి నెలలో సగటున 2,745 మెగా యూనిట్లు డిమాండ్ కాగా, ఏప్రిల్‌లో 3,092 మెగా యూనిట్లుగా డిమాండ్ ఉంది. 2023 మార్చిలో 2,814 మెగాయూనిట్ల డిమాండ్  కాగా, ఏప్రిల్ నెలలో 3,148 మెగా యూనిట్ల డిమాండ్‌గా ఉంది. ఇదిలా ఉండగా, 2024 మార్చి నెలలో 3,378 మెగా యూనిట్లు డిమాండ్ ఉండగా, ఏప్రిల్ 14 నాటికే 3,655 మోగా యూనిట్ల డిమాండ్‌కు చేరుకుంది.

ఈ క్రమంలో 2022లో మార్చిలో 57.45 మిలియన్ యూనిట్లు)మి.యూనిట్లు, ఏప్రిల్‌లో 66.16 మి.యూ, 2023 మార్చిలో 57.84 మి.యూ, ఏప్రిల్‌లో 66.80 మి.యూ, 2024 మార్చిలో 72.02 మి.యూ, ఏప్రిల్ 17వ తేదీ నాటికి 78.55 మి.యూనిట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా గత నవంబర్ మాసంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రోజుకు 65.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా, 18 జిల్లాలు కలిగిన ఎన్‌పీడీసీఎల్ కంపెనీలో 51.64 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే జరిగినట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

గ్రేటర్‌లో సగటున 60.30 మి.యూ విద్యుత్ వినియోగం కాగా, ఎన్‌పీడీసీఎల్‌లో ఇది 44..52 మిలియన్ యూనిట్లుగా మాత్రమే నమోదు అయ్యింది. నవంబర్‌లో యావత్తు ఎన్‌పీడీసీఎల్‌కంపెనీలో సగటున 48.95 మిలియన్ యూనిట్లు కాగా, 2,692 మెగావాట్ల విద్యుత్ వినియోగం అయ్యింది. గ్రేటర్‌లో అయితే.. 59.91 మిలియన్ యూనిట్లు కాగా, 3,069 మెగావాట్లుగా నమోదయ్యింది. 

పెరుగుతున్న ప్రత్యేక డిస్కం డిమాండ్

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్)లోని హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏడాది విద్యుత్ వినియోగం అత్యధికంగా నమోదవుతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని సెంట్రల్, సౌత్ సర్కిల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్ ఉండగా, మేడ్చల్ జోన్‌లోని.. మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్లు, రంగారెడ్డి జోన్‌లోని.. సరూర్‌నగర్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్ మొత్తం 9 సర్కిళ్లు ఉన్నాయి.

ఇటీవలనే అదనంగా సంగారెడ్డి సర్కిల్‌ను మేడ్చల్ జోన్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో దాదాపు 62 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. మొత్తం ఎన్‌పీడీసీఎల్ కంపెనీ పరిధిలో 66 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ నడుస్తున్నా.. ఎన్‌పీడీసీఎల్ కంటే గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధికంగా విద్యుత్ వినియోగం నమోదు కావడం విశేషం.

ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరించడం, భవన నిర్మాణాలు విస్తరించడం, గృహ వినియోగదారులతో పాటు పరిశ్రమలు అత్యధికంగా ఉంటున్నందున గ్రేటర్‌లో ఈ తరహాలో విద్యు త్ వినియోగం నమోదవుతున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న సర్కిళ్లకు మాత్రమే ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.