హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం “తుఫాన్”. విజయ్ మిల్టన్ దర్శకుడిగా ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్‌లో తెలియజేశారు. ఇందులో ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి తననెవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజయ్ ఆంటోనీ. అతన్ని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు.
అలాంటి హీరోని ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి మురళీ శర్మ హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఎవరి గతంలోనూ లేని హీరో గతమేంటి..? అతని కోసం పోలీసులు ఎందుకు వేటాడుతున్నారు? తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేయనున్నాడు వంటి అంశాలతో ఈ ట్రైలర్ రూపొందింది. ఇప్పటికే “తుఫాన్” సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తదితరులు నటిస్తున్న ఈ సినిమా జూలైలో విడుదల కానుంది.