అధిక చక్కెర వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విషయంలో కట్టడి చేయాలని సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో షుగర్ ఐటమ్స్ ఇవ్వవద్దని సలహా ఇస్తున్నారు. తాజా పరిశోధన ప్రకారం శిశువుల తొలి రెండేళ్లలో చక్కెర వినియోగాన్ని కంట్రోల్ చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
చిన్న వయసులో చక్కెర వినియోగం పరిమితిలో ఉంచుకోడం వల్ల టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని 35 శాతం తగ్గించవచ్చు. రక్తపోటు ప్రమాదం నుంచి 20 శాతం మేర తప్పించుకోవచ్చు. ఇండియాలో టైప్ 2 షుగర్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఈ చక్కెర వాడుక తగ్గింపు సూచన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడంలో తోడ్పడుతుంది.
పిల్లలకు పంచదారతో చేసిన తీపి పదార్థాలను ఎంత తక్కువగా తినిపిస్తే అంత మంచిది. పండ్లు, కూరగాయల్లో ఉన్న చక్కెరతో పాటూ, ఇతర ఆహారపదార్థాల వల్ల తిన్న చక్కెర కూడా చేరి పిల్లల్లో చాలా మార్పులు కలుగుతాయి.
ఇది వారిలో చిన్న వయసులోనే బరువు పెరగడం, ఊబకాయం, దంత క్షయం ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో ముడిపడి ఉంటుంది. యూరోపియన్ న్యూట్రిషన్ కమిటీ రెండేళ్ల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు పంచదారను ఎంత తక్కువగా పెడితే అంత మంచిదని చెబుతున్నారు.
రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పసిబిడ్డలలో పంచదార పూర్తిగా పెట్టకపోవడమే మంచిది. రెండు నుండి ఏడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పంచదార తక్కువగా తినిపించాలి.
రోజుకు 15 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు ఉండవచ్చు. ఏడు నుండి 13 సంవత్సరాల వయస్సు ఉన్న వారు 22 నుండి 27 గ్రాములకు మించకుండా పంచదార తినాలి. 13 ఏళ్ల నుంచి19 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 27 నుండి 37 గ్రాముల వరకు పంచదారను తినవచ్చు. అంతకుమించి తినకపోవడమే మంచిది.