calender_icon.png 26 November, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 టన్నుల డ్రగ్స్ పట్టివేత

26-11-2024 02:20:02 AM

  1. అండమాన్‌లో సీజ్ చేసిన కోస్ట్‌గార్డ్స్
  2. దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ ఆపరేషన్ సక్సెస్
  3. సత్ఫలితాలనిస్తున్న ‘సాగర్ మథన్-4’

పోర్ట్ బ్లెయిర్, నవంబర్ 25: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ (ఐఎస్‌జీ) చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. అండమాన్ నికోబార్ జలాల్లో మాటు వేసి ఏకం గా 5 టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటి సారి. సముద్ర మార్గాల ద్వారా డ్రగ్స్ రవాణా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

దీనిలో భాగంగా ఇప్పటివరకు మూడు విడతలుగా ‘సాగర్ మథన్’ డ్రైవ్‌ను అమలు చేసింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) నేతృత్వంలో డ్రైవ్ కొనసాగగా, కోస్ట్ గార్డ్స్ ముఖ్యపాత్ర పోషిస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ‘సాగర్ మథన్-4’ అమలవు తున్నది. ఈ నేపథ్యంలో కోస్ట్‌గార్డ్స్ ఇండియా అండమాన్ జలాల మధ్య డ్రగ్స్ రవాణాపై నిఘా పెట్టారు.

పోర్ట్‌బ్లెయిర్‌కు 150 కి.మీ దూరంలోని బారెన్ ద్వీపం నుంచి ఆదివారం వేగంగా వెళ్తున్న ఫిష్షింగ్ బోటు కని పించింది. దీంతో కోస్ట్‌గార్డ్స్ బోటును వెంబడించి అడ్డుకున్నారు. బోటును సోదా చేయగా 5 టన్నుల డ్రగ్స్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. మయన్మార్‌కు చెందిన ఆరుగురు నిందితులను ఆదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో  వేలాది కోట్లు ఉంటుందని కోస్ట్‌గార్డ్స్ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.