వ్యక్తులు, ఎన్జీవోలు, కుల, సంక్షేమ సంఘాలకు ఆహ్వానం
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుకు గురైన బీసీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సిన రిజర్వేషన్ల సౌకర్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో బహిరంగ విచారణను ఏర్పాటు చేశారు.
ఈ నెల 11వ తేదీన ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాసాబ్ ట్యాంక్ డీఎస్‌ఎస్ భవన్‌లోని 4వ అంతస్తులో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణకు ఎవరైనా హాజరుకావొచ్చు. అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉం టుంది.
ఈ నెల 12న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో ఎన్జీఓలు, సంస్థలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు మాత్రమే హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డెడికేటెడ్ కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.