27-02-2025 12:00:00 AM
రేపు జాతీయ సైన్స్ దినోత్సవం
భారతదేశ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్, తాను కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ సిద్ధాంతాన్ని 1928 ఫిబ్రవరి 28న ప్రకటించా రు. ఫలితంగా 1930లో భౌతికశాస్త్రంలో ఆయన నోబెల్ బహుమతి అందుకున్నారు. దీనికి గుర్తుగా 1986 నుంచి మన దేశంలో ఆ రోజును ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ప్రజ ల దైనందిన జీవితంలో, సమాజాభివృద్ధిలో సైన్స్ ప్రాముఖ్యాన్ని వివరించడం, మానవాభివృద్ధిలో విజ్ఞానశాస్త్ర విజయాలను ప్రదర్శించడం, ఈ మేరకు ప్రజలలో అవగా హన, ఆసక్తులను పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పేలా పాటు పడడం వంటి బృహత్ లక్ష్యాలతో ఈ ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటాం.
అయితే, గత కొన్నేళ్లుగా విద్య, పరిశోధన, అభివృద్ధి రంగాలకు చాలినంత మేర బడ్జెట్ కేటాయింపులు జరపకపోవడం బాధాకరం. ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024’లో మన దేశం 134వ స్థానంలో ఉండడం దురదృష్టకరం. పేటెంట్ హక్కు పత్రాల సమర్పణలో 2024లో భారతదేశం 6వ స్థానంలో ఉంది. మనకంటే ముందు చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఉన్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు మేథోవలస బాట పట్టకుండా కృషి చేయవలసి ఉంది.
ఇదే సమయంలో శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులలో పెంపొందింప జేయాలి. ఏఐ వంటి కొత్త సాంకేతిక విభాగాలకు తగినంత ప్రోత్సాహం అందించాలి. గ్లోబలైజేషన్‌లో భాగంగా ఇంటర్నెట్, టి.వి, సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా ప్రపంచం కుగ్రామంగా మారింది. కనుక, ర్యాంకులు, గ్రేడుల సాధనే ధ్యేయం కాకుండా ఆల్ రౌండ్ డెవలప్మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి.
ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి. విద్యార్థులకు ఫీల్డ్ ట్రిప్‌లకు అవకాశం కల్పించాలి. వారు పరిసరాలను పరిశీలించేలా ప్రోత్సహించాలి. సముద్ర యానంలో ద్వారానే సి.వి.రా మన్ పైన పేర్కొన్న అద్భుత సిద్ధాంతాన్ని కనిపెట్టారు. లెర్నింగ్ బై డూయిం గ్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు, వ్యాస రచనలు, వక్తృత్వం, క్విజ్, చర్చలు వంటి అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలి. 21వ శతాబ్దంలో ప్రశ్నించే తత్వాన్ని పిల్లలకు నేర్పడం ఎంతో అవసరం. అజ్ఞానం, మూఢాచారాలు, మూర్ఖపు విశ్వాసాలకు వారిని దూరం పెడదాం. అధ్యయనం, విశ్లేషణల తో కొత్త లోకాన్ని అందిద్దాం.
ఐ.ప్రసాదరావు