25-03-2025 12:54:00 AM
పార్టీ జాతీయ అధ్యక్షుని రేసులో కిషన్ రెడ్డి?
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి) : రెండు మూడు రోజుల్లో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆదివారం రాత్రి హుటాహుటిన కేంద్రమంత్రి, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఢిల్లీకి పిలిచారని సమాచారం. ఆదివారం నగరంలో ముందే నిర్ణయించిన బీహార్ దివస్ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది.
అందుకు తగ్గట్లుగా నిర్వాహకులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన ఈ కార్యక్రమానికి రావడంలేదని సమాచారం వచ్చింది. అయితే ఇందుకు సోమవారం పార్లమెంటులో మొదటి ప్రశ్నకు సమాధానం కిషన్‌రెడ్డి ఇవ్వాల్సి ఉన్నందునే.. అని పార్టీకి చెందిన కొందరు చెబుతున్నా, అది కరెక్టు కాదని..
పార్టీ నూతన అధ్యక్షుని నియామకంతో పాటు జాతీయ అధ్యక్షుని నియామకానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు హఠాత్తుగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు. ఇక డీలిమిటేషన్, హిందీ భాష వ్యవహారంపై ఇప్పుడు దక్షిణాది నుంచి వ్యతిరేకత వస్తుందేమోననే భయం కూడా ఢిల్లీ పెద్దలకు పట్టుకుందని..
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుని పదవిని కూడా దక్షిణాది వారికి ఇచ్చి చల్లబర్చే విషయం ఆలోచిస్తున్నారని సమాచారం. అందుకే కిషన్‌రెడ్డికి ఈ పిలుపు అని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కిషన్‌రెడ్డిని జాతీయ పార్టీకి అధ్యక్షుడిని చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీపై పడింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కూడా సమయం దగ్గరపడిన నేపథ్యంలో తెలంగాణ అధ్యక్షుని ఎంపిక రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని కట్టబెడితే రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలోపు బీజేపీలో అనేక కీలకమైన అప్‌డేట్స్ చోటుచేసుకుంటాయని తెలుస్తోంది.