calender_icon.png 15 January, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు టాలీవుడ్ చేయూత

04-09-2024 12:00:00 AM

తెలుగు రాష్ట్రాల్లో వరదలు తీవ్ర నష్టం కలిగించిన నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. విపత్తు వేళ భారీ విరాళం అందించి వరద బాధితులకు అండగా నిలిచారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతుగా సాయం చేసి రియల్ హీరోలుగా నిలిచారు. 

బాలయ్య భారీ విరాళం

నందమూరి నటసింహం బాలయ్య రూ. కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు. సోషల్ మీ డియా వేదికగా స్పందించారు. “ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరి స్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా” అని నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి ప్రకటించారు.

జూనియర్ ఎన్టీఆర్ గొప్ప మనసు

ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవత్వాన్ని చాటుకు నే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుత వరదల నేపథ్యంలో మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. వరద బాధితులకు అండగా తనవంతు సాయాన్ని అందించటానికి ఆయన ముందుకొచ్చా రు. వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చలించి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.50 లక్షలు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు విరాళంగా అందించారు.

డిజే టిల్లు సైతం..

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా తోటివారికి తోచినంత సాయం చేయటంలో ముందుంటుంటారు. వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడంతో  సిద్ధు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతు సాయం అందించటానికి ముందుకు వచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు, తెలంగాణ రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు విరాళాన్ని అందించారు.

త్రివిక్రమ్ అండ్ ప్రొడ్యూసర్స్

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో సంయుక్తంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ. ఏపీకి రూ.25లక్షలను, తెలంగాణకు రూ.25లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. “భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు  మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాం” అని తెలిపారు.

మాస్‌కాదాస్ దాతృత్వం

యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కొద్ది నిమిషాలకే విశ్వక్ సేన్ కూడా స్పందించి సాయం చేయడం విశేషం. 

ఇంకా ఎవరెవరు?

  1. వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు
  2. ‘ఆయ్’ మూవీ టీం ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
  3. వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు