హైదరాబాద్: పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సినీప్రముఖులకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సినీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినీ పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రమోట్ చేయాలని కోరారు. బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రతయ్నం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో సదస్సు ద్వారా సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. సినీ పరిశ్రమ(Tollywood)ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. డ్రగ్స్, సామాజిక అంశాలపై సినీ పరిశ్రమ ప్రచారం చేయాలన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు బ్రాండ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్యవర్తిగా ఎఫ్ డీసీ ఉంటుందన్నారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ గా దిల్ రాజును నియమించామన్న సీఎం తెలంగాణలో అవార్డులు ఇవ్వట్లేదని తెలిసి గద్దర్ అవార్డులు(Gaddar Cine Awards) ఏర్పాటు చేశామని చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. సీఎంగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాదన్న ఆయన తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.