హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27(విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆస్పత్రులు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఎవరైనా గుర్తిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 3366కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం గర్భస్థ పిండ ప్రక్రియ లింగ నిర్ధారణ చట్టంపై జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని ప్రభుత్వ కళాశాలల్లో లింగ నిష్పత్తి, లింగ వివక్షతపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల న్నారు. 2025 మార్చి వరకు సదస్సులు నిర్వహించాలని సూచించారు. స్కానింగ్ సెంటర్ల రెన్యూవల్, కొత్తగా 78 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. సమావేశంలో డీఆర్వో ఇ.వెంకటాచారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.అరుణకుమారి, అడిషనల్ డీసీపీ జి.మనోహర్, డీఎంఅండ్ హెచ్‌వో జె.వెంకటి పాల్గొన్నారు.