calender_icon.png 24 November, 2024 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీటి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్

27-10-2024 02:24:41 AM

  1. నీటి సరఫరాలో సమస్యలు రాకూడదు
  2. భగీరథ పైప్ లైన్ల లీకేజీని అరికట్టాలి
  3. మిషన్ భగీరథపై సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయ క్రాంతి): మంచినీటి సమస్యల ఫిర్యాదుల కోసం త్వరలో టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. శనివారం మిషన్ భగీరథ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఎక్కడా సమస్యలు రాకూడదని అధికారులను ఆదేశించారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిలువలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక నీటి వనరులపై దృష్టి సారించాలన్నారు.

ప్రతి ఐదారు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా చేసుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా బోర్లు వేయించాలని, ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు.

వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బోర్ల మీద, ఆర్వో ప్లాంట్ల మీద ప్రజలు ఆధారపడుతున్నారని, ఆ విధానం పోయేలా మిషన్ భగీరథ సిబ్బంది పనిచేయాలని హితవు పలికారు. ప్రతి ఇంటి కి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టడంతోపాటు మిషన్ భగీరథ ట్యాంకులను తరచు శుభ్రపరచాలని ఆదేశించారు. పైప్‌లైన్ల లీకేజీని అరికట్టాలన్నారు. 

ప్రతి ఏఈ చేతిలో యాక్షన్ ప్లాన్..

తాగునీటి సరఫరాపై అన్ని గ్రామాల నుంచి నెలవారీగా నివేదికలు తెప్పించాలని సూచించారు. నీటి సరఫరాలో సమస్య తలెత్తుతున్న ఉట్నూర్ వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని డిప్యూట్ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమస్య తలెత్తినా పైఅధికారులకు సమాచారం ఇవ్వాలని, ఏ నెలలో ఏ పని చేయాలో క్యాలెం డర్‌ను రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ప్రతి ఏఈ చేతిలో యాక్షన్ ప్లాన్ ఉండాలని, ఆయా గ్రామాల్లో ఏదైనా సమస్యతో మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ప్రత్యా మ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత సమ్మర్‌లో నీటి ఎద్దడి ఉన్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీటిని అందించామని తెలిపారు. ఇప్పటివరకు 13,456 మంది మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, సీఈ, ఎస్‌ఈ, ఈఈలు పాల్గొన్నారు.