జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు...
సంగారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రత కార్డుల మంజూరులో సమస్యల ఫిర్యాదు కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి(District Collector Kranti Valluru) ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుండి చేపట్టనున్న నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించిన సర్వే ఫిర్యాదులు, అభ్యంతరాలకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 08455-272233 ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సులభంగా సేవలు అందించడానికి ఈ నెంబర్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు.
ఫిర్యాదుదారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 08455-272233 ద్వారా ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం పొందే అవకాశముందని కలెక్టర్ వివరించారు. టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించుకొని ప్రజలు ప్రభుత్వ సేవలను సులభతరంగా పొందవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.