జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వాహనదారుల్లో చాలామంది తాము తక్కువ దూరం ప్రయాణించినా టోల్ చార్జీలు మాత్రం పూర్తిగా చెల్లించాల్సివస్తుందని బాధపడుతుంటారు. అలాంటివారికందరికీ కేంద్రప్రభుత్వం తీపికబురు అందించింది. శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు అమలు చేసేందుకు మరో ముందడుగు వేసింది. తాజాగా ఈ విధానానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008ని సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం టోల్ గేట్ల వద్ద కొత్తగా గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్(జీఎన్‌ఎస్‌ఎస్) ఆధారంగా టోల్ చార్జీలు వసూలు చేసే విధానం అమలులోకి రానుంది.
ఇప్పటికే అమలులో ఉన్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతకు తోడు ఇది అదనంగా ఉంటుంది. ఈ మూడు విధానాలు అమలులో ఉంటాయి. ఇకపై నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌తో కూడిన ఆన్‌బోర్డు యూనిట్ కలిగిన వాహనాలు టోల్‌ప్లాజా మీదుగా వెళ్తున్నప్పుడు ప్రయాణించిన దూరానికి ఆటోమేటిగ్గా చెల్లింపు జరిగిపోతుంది. ఈ తరహా వాహనాలకోసం టోల్‌ప్లాజాలవద్ద ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయనున్నారు. నేవిగేషన్ డివైజ్‌లు లేని వాహనాలకు సాధారణ టోల్ చార్జీలే వర్తిస్తాయి. అలాగే కొత్తగా 20 కిలోమీటర ్లవరకు జీరో టోల్ కారిడార్‌ను తీసుకువచ్చారు.
అంటే జాతీయ రహదారిపై 20 కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆపై ప్రయాణిస్తే దూరానికి తగ్గట్టు టోల్ చెల్లించాలిస ఉంటుంది. వాస్తవానికి టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గిచడానికి కేంద్రం టోల్ విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఒకప్పుడు మాన్యువల్‌గా చెల్లించే విధానం ఉండగా, కొన్నేళ్లకు ఫాస్టాగ్‌నును తీసుకువచ్చారు. దీంతో కొన్నిసెకన్ల పాటు వాహనాన్ని ఆపాల్సి ఉంటుంది. పైగా కిలోమీటర్లతో సంబంధం లేకుండా టోల్ చెల్లించాల్సి వచ్చేది.
అయితే ఫాస్టాగ్ విధానం వచ్చిన తర్వాత టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పడు ఈ కొత్త విధానంలో వాహనంలో ఉండే పరికరం అది ఎంతదూరం ప్రయాణించిందీ లెక్కగడుతుంది. దీంతో ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. పైగా టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ పరికరాలు ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్స్‌లో లభిస్తాయి. ఇవి కూడా ఫాస్టాగ్‌ను పోలి ఉంటాయి.వాహనాల తయారీదారులు త్వరలోనే వీటిని అమర్చిన వాహనాలను విక్రయించే అవకాశం ఉంది. తొలుత ప్రధాన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ విధానాన్ని అమలు చేశాక దేశవ్యాప్తంగా ఆ తర్వాత అమలు చేస్తారు.
ప్రస్తుతం నేషనల్ హైవేస్ అథారిటీకి టోల్‌ప్లాజాల ద్వారా ఏటా దాదాపు రూ.40 వేల కోట్లు ఆదాయం వస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో టోల్ వసూలు వ్యవస్థను పూర్తిగా అమలు చేసినప్పుడు ఇది రూ.1.4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌ను ఉపయోగించి కొత్త వ్యవస్థతో ఇప్పుడున్న ఫాస్టాగ్‌ను సమగ్రపరచాలని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది. ఫాస్టాగ్ లాంటి ఎన్ని మార్పులు తీసుకువచ్చినా టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఇప్పటికీ ఎక్కువగానే ఉంటోంది. పండగలు లాంటివి వస్తే ఇక చెప్పనవసరం లేదు.
దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే ఒకే మార్గంలో 60 కిలోమీటర్ల లోపు ఉండే ఒకటి కంటే ఎక్కువ టోల్‌గేట్లను ఎత్తివేస్తామని పార్లమెంటులోనే ప్రకటించారు కూడా. మరో వైపు టోల్‌గేట్లను ఎత్తివేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఇదొక ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా మారుతోంది. ఢిల్లీకి దగ్గరగా ఉన్న హర్యానాలోని గుర్గావ్ , ఫరీదాబాద్ లాంటి నగరాల మధ్య నిత్యం వేలకొద్ది వాహనాలు తిరుగుతుండడం, ప్రతిరోజూ టోప్లాజాల వద్ద రద్దీ కారణంగా గంటలకొద్దీ వాహనాలు ఆగిపోతుండడమే దీనికి కారణం.