25-03-2025 12:54:31 AM
రవాణా సౌకర్యం కల్పించిన గోనె పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
చేవెళ్ల, మార్చి 24 : తోల్కట్టలోని మల్లవరపు సీతమ్మ మెమోరియల్ హై స్కూల్ కు చెందిన 60 మంది 7, 8వ తరగతి విద్యార్థులు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని పొందారు. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో భాగంగా చట్టాల తయారీ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు వారు సోమవారం గంటన్నర పాటు అసెంబ్లీ కార్యకలాపాలను గమనించారు.
ఇందుకు శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారం అందించగా.. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి వారికి రవాణా సౌకర్యం కల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు , సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు వాణి సక్కుబాయి, ఉపాధ్యాయులు అమృత, విజయలక్ష్మి , రాజ్ కుమార్ అసెంబ్లీ, చట్టాల గురించి వారికి వివరించారు. అసెంబ్లీ సందర్శన అనంతరం విద్యార్థులు రాష్ట్ర సచివాలయంతో పాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. వీరికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.