* నెలరోజులుగా అన్నదాతల ఎదురుచూపులు
* మద్నూర్‌లో జాతీయ రహదారిపై రైతుల ఆందోళన
* సబ్‌కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేత
కామారెడ్డి, జనవరి 16 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల రోజుల నుంచి రైతులు కొనుగోలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరకు వారినుంచి స్పందన లేకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గురువారం జరిగింది.
మద్నూర్, డోగ్లీ మండలాలకు చెందిన రైతులు తాము పండించిన సోయాను విక్రయించేందుకు మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వస్తే అధికారులు రేపుమాపు అంటూ తిప్పుకుంటున్నారే తప్పా, కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. దీంతో గురువారం 161 జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్నూర్ సహకార సంఘం అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల రోజుల నుంచి తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కొంతమంది అధికా అవినీతికి పాల్పడి కాంటాలు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు తమ టోకెన్లు ఇవ్వడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు.
సహకార సంఘాల్లో సోయా పంట పెద్ద ఎత్తున నిల్వలు ఉంటే వాటిని కొనుగోలు చేయకపోవడంతో తమ బతుకులు ఆగమ్య గోచరంగా మారినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి రైతుల వద్దకు వచ్చి విషయాన్ని తెలుసుకున్నారు.