calender_icon.png 21 September, 2024 | 2:03 AM

పార్ట్ టైం ఉద్యోగం పేరుతో టోకరా

21-09-2024 12:03:01 AM

ఓ యువతి నుంచి 4.72 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పార్ట్ టైం ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం అంటూ ఓ యువతికి మాయమాటలు చెప్పి రూ. 4.72 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ యువతికి పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మంచి ఉద్యోగం.. రూ. లక్షల్లో వేతనం అందిస్తామనేది మెసేజ్ సారాంశం. ఆసక్తి ఉంటే coindmy.com లింక్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీంతో బాధితురాలు వారు సూచించిన విధంగా తన వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను అందులో పొందుపరిచింది.

మొదటగా రూ. 200 లాభంగా అందుకుంది. ఈ క్రమంలో బాధితురాలిని ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేసి వారు చెప్పిన విధంగా ఫాలో అవ్వాలని తెలిపారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితురాలు పలు దఫాలుగా మొత్తం రూ. 4.72 లక్షలు చెల్లించింది. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో  మోసపోయానని గ్రహించి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.