calender_icon.png 23 October, 2024 | 11:23 PM

ఉద్యోగాల పేరుతో టోకరా

10-07-2024 05:40:06 AM

  • నిరుద్యోగుల నుంచి రూ.4కోట్లకు పైగా వసూలు 
  • నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 9 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఉద్యోగం ఆశచూపి ఘరానా మోసానికి పాల్పడిన ముఠా గుట్టును రట్టు చేశారు భద్రాద్రి పోలీసులు. నిందితులను అరెస్టుచేసి వారి నుంచి కోటిన్నర నగదు, 4 తులాల బంగారం, బైకును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్పీ రోహిత్‌రాజు మీడియాకు  వివరాలను వెల్లడించారు. దాసు హరిసింగ్, గుండా వినోద్ కుమార్, ఉపేంద్ర నాయుడు, దాసు హరికతోపాటు మరికొందరు కలిసి 2018 నుంచి సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, క్లర్క్స్, డిపెండెంట్ ఉద్యోగాలు, గ్రూప్ ఏసీటీఓ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 60 మందితో ఒప్పందం కుదుర్చుకున్నారు. పలు దఫాలుగా వారివద్ద నుంచి రూ.4.08 కోట్ల వరకు వసూలు చేశారు.

ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన నిరు ద్యోగులు గతేడాది మేలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు మొత్తం 13మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రుహత్‌బేగ్, ఉపేందర్ నాయుడు, రవిరాజ్‌ను త్వరలో పట్టుకుంటామన్నారు. మోసం చేసి సంపాదించిన డబ్బుతో నిందితులు 92.5 తులాల బంగారు ఆభరణాలను కొని.. వాటి ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నటు వెల్లడించారు. వాటిని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామన్నారు పోలీసులు. నిందుతులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కేసును ఛేదించిన డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ప్రవీణ్‌ను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.