calender_icon.png 16 January, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెట్టింపు లాభమని 700 కోట్లకు టోకరా

14-09-2024 12:06:48 AM

సుమారు 18 వేల మంది బాధితుల నుంచి వసూలు

అనంతరం బోర్డు తిప్పేసిన మాదాపూర్‌లోని డీకే జెడ్ టెక్నాలజీస్ సంస్థ

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో గోడును వెల్లబోసుకున్న బాధితులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): పెట్టిన పెట్టుబడులకు కేవలం 25 రోజుల్లోనే రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికి వేలాది మందిని నిండా ముంచి సుమారు రూ. 700 కోట్లు కొల్లగొట్టారు కొందరు కేటుగాళ్లు. డీకే జెడ్ టెక్నాలజీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆశను ఆయుధంగా మలుచుకొని, అధిక లాభాల పేరుతో పెట్టుబడులు సేకరించి అనంతరం బోర్డు తిప్పేశారు. ఈ ఘటన నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

దాదాపు ఐదేళ్ల క్రితం మాదాపూర్‌లో డీకే జెడ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఏర్పాటైంది. సంస్థలో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రముఖ యూట్యూబర్స్‌తో రీల్స్ చేయించారు. యూట్యూబర్స్ కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు గడించినట్లు చెప్పడంతో నిజమేనని నమ్మిన వేలాది మంది రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. ఈ మొత్తం సుమారు రూ. 700 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

చివరకు లాభాలు పక్కన పెడితే అసలుకే టోపీ పెట్టారు సంస్థ నిర్వాహకులు. నగరవ్యాప్తంగా 18 వేల బాధితులు ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ ఘటనలో డబ్బులు పోగొట్టుకున్న వందలాది మంది బాధితులు శుక్రవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకొని  మీడియాతో తమ బాధను పంచుకున్నారు. ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్)కు తరలివెళ్లి నిందితులను వెంటనే పట్టుకొని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని ఆందోళన చేపట్టారు.