సమష్టి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, తోడికోడళ్ల మధ్య ఉత్పన్నమయ్యే సంఘర్షణలే ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘తోడికోడళ్ళు’. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూధనరావు నిర్మాతగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిదింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగా రావు, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి తదిత రులు ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు శరత్ చంద్ర ఛటర్జీ నవల ‘నిష్కృతి’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి, అక్కినేని ముగ్గురూ అన్నదమ్ములు. కన్నాంబ, సూర్యకాంతం, సావిత్రి తోడికోడళ్లుగా నటించారు. పెద్దన్న కుటుంబరావు (ఎస్వీ రంగారావు) ఒక మతిమరుపు లాయర్.
ఆయన భార్య (కన్నాంబ) సంప్రదాయ గృహిణి. రెండవవాడు రమణయ్య (రేలంగి), ఆయన భార్య అనసూయ (సూర్యకాంతం). మూడవవాడు సత్యం (అక్కినేని) ఆయన భార్య సుశీల (సావిత్రి). అనసూయ తమ్ముడు వైకుంఠం (జగ్గయ్య) ఇంట్లో చేరి తన అక్కతో కలిసి కుటుంబంలో పొరపొచ్చాలు తీసుకొచ్చి సంసారాన్ని ముక్కలు చేస్తాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది. మళ్లీ ఆ కుటుంబం ఎలా ఏకమవుతుందనేది కథాంశం.